భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ‘కెప్టెన్ కూల్’ ఎం.ఎస్. ధోనీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మైదానంలో తన ప్రశాంతమైన వైఖరితో, మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాలతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1981లో బీహార్‌లోని (ప్రస్తుతం జార్ఖండ్) రాంచీలో జన్మించిన ధోనీ, ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇప్పటికీ ఆడుతూనే ఉన్నారు. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మరోసారి చెన్నై పగ్గాలు చేపట్టి తన నాయకత్వ పటిమను చాటుకున్నారు.
ధోనీ రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి పేరు పాన్ సింగ్, తల్లి పేరు దేవకీ దేవి. ధోనీ తన తోబుట్టువులలో అందరికంటే చిన్నవాడు. డీఏవీ జవహర్ విద్యా మందిర్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ధోనీ, మొదట గోల్ కీపర్‌గా ఫుట్‌బాల్ ఆడేవారు. అయితే, కోచ్ సలహా మేరకు క్రికెట్ వైపు అడుగులు వేశారు. 2001 నుంచి 2003 వరకు ధోనీ రైల్వేలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్(టీటీఈ)గా కూడా పనిచేశారు.
మొదట్లో ధోనీ ఆటతో పాటు ఆయన పొడవైన జుట్టుతో ఆడపిల్లల కలల రాకుమారుడిగా ఓ వెలుగు వెలిగాడు. తన దూకుడైన ఆటతీరు కారణంగా ఆయనకు అభిమానులు చాలా తక్కువ సమయంలోనే పెరిగిపోయారు. 2007లో ధోనీ సారథ్యంలో టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలవడంతో దేశవ్యాప్తంగా ధోనీ మేనియా మొదలైంది. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి, ధోనీ భారత క్రికెట్ చరిత్రలో ఒక స్టార్‌గా ఎదిగారు. భారత జట్టును అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత కూడా ధోనీకే దక్కుతుంది.
ధోనీ ఖాతాలో 8 అరుదైన అవార్డులు
తన అద్భుతమైన కెరీర్‌లో ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి
1. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు (2008): క్రీడలలో అత్యున్నత పురస్కారం.
2. పద్మశ్రీ అవార్డు (2009): భారత ప్రభుత్వం అందించే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం.
3. ఐసీసీ పీపుల్స్ ఛాయిస్ అవార్డు (2013): అభిమానుల ఓట్లతో దక్కించుకున్న గౌరవం.
4. పద్మ భూషణ్ (2018): భారత ప్రభుత్వం అందించే మూడవ అత్యున్నత పౌర పురస్కారం.
5. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది డికేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్) – 2011-2020: దశాబ్దపు ఉత్తమ వన్డే జట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంపిక.
6. ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది డికేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్) – 2011-2020: దశాబ్దపు ఉత్తమ టీ20 జట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంపిక.
7. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్ – 2011-2020: క్రీడా స్ఫూర్తిని చాటినందుకు దశాబ్దపు అవార్డు.
8. ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ (2020): క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లను సత్కరించే గౌరవం.
కెప్టెన్‌గా ధోనీ రికార్డులు 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 2008లో ఎం.ఎస్.ధోనీని అన్ని ఫార్మాట్లకు భారత కెప్టెన్‌గా నియమించారు. ఆయన కెప్టెన్‌గా మొత్తం 332 అంతర్జాతీయ మ్యాచ్‌లు (60 టెస్టులు, 200 వన్డేలు, 72 టీ20లు) ఆడారు. ఈ మ్యాచ్‌లలో భారత్ 179 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 120 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ధోనీ కెప్టెన్సీలోనే భారత జట్టు క్రికెట్ ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా అవతరించింది.