భార్యను చంపేందుకు రవిశంకర్‌ పక్కా ప్లాన్‌.. అరెస్ట్‌తో అడ్డం తిరిగిన అసలు కథ!

అనుమానం పెంచుకుని భార్య చంద్రికతోపాటు కన్నబిడ్డల (లక్ష్మీ హిరణ్య 9 ఏళ్లు, లీలసాయి ఏడేళ్లు)ను పొట్టనపెట్టుకున్న రవిశంకర్‌ కేసులో మరో షాకింగ్‌ విషయం బయటపడింది. భార్య బిడ్డలను చంపి అదృశ్యమైన అతగాడిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన అరెస్ట్‌ చేయడంతో అసలు కథ అడ్డం తిరిగింది. రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు.. అతనిలోని సైకోయిజం తాలుకు వివరాలను ఒక్కొక్కటిగా బయటకు వెలికి తీస్తున్నారు..

పదేళ్ల కిందటే భీమవరంలో చంద్రికను ప్రేమించి వివాహం చేసుకున్న రవిశంకర్, తన భార్య మరొకరితో పదేపదే పోన్‌ కాల్స్ మాట్లాడటం చూసి అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంతో 2022లోనే భార్యా, పిల్లల్ని తీసుకుని కాపురాన్ని మైలవరానికి మార్చాడు. అయినా భార్యతో అతడి స్నేహం తగ్గకపోగా.. తరచూ ఫోన్‌లో మాట్లాడుకోసాగారు. అతడు అప్పుడప్పుడూ మైలవరం కూడా వచ్చి వెళ్లినట్లు భావించిన రవిశంకర్‌.. కన్నబిడ్డలతోపాటు భార్య, ఆమె స్నేహితుడిని కూడా మట్టుబెట్టాలనుకున్నాడు. అందుకు పథకం కూడా పన్నాడు. తొలుత పిల్లల్ని చంపి, భార్యను మానసికంగా కుంగదీయాలని భావించాడు. అనంతరం భార్యతోపాటు ఆమె స్నేహితుడి హత్యకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే పిల్లల్ని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖరాశాడు. ఈ మేరకు జూన్‌ 8వ తేదీ రాత్రి మైలవరంలో అతడు పనిచేసే హోటల్‌ యజమానికి కూడా తెలిపాడు. అయితే పోలీసులకు సకాలంలో సమాచారం అందలేదు. దీంతో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలయ్యాయి. పిల్లల హత్య అనంతరం రవిశంకర్‌ గడ్డం తొలగించి, విశాఖపట్నం పారిపోయి అక్కడ ఓ హోటల్‌లో పనికి కుదిరాడు.

అయితే చేతిలో డబ్బులు అయిపోవడంతో తన ఆధార్‌ కార్డుతో కొత్త సిమ్‌ తీసుకుని తన ఫోన్‌లో వేసి, జూన్‌ 18న జి.కొండూరులోని పాఠశాలలో తనకు తెలిసిన వ్యక్తికి డబ్బుల కోసం ఫోన్‌ చేశాడు. అంతే సదరు వ్యక్తి జి.కొండూరు ఎస్సై కారు డ్రైవర్‌కు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు విశాఖపట్నం చేరుకుని నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. విచారణలో భార్య వేరే వ్యక్తితో తరచూ ఫోన్‌ మాట్లాడుతుండటంతో వల్లనే ఈ దారుణానికి పాల్పడినట్లు పదేపదే చెబుతుండటంతో పోలీసులు కాల్‌ డీటెయిల్స్‌ రికార్డు తెప్పించి పరిశీలించారు. అయితే అందులో సదరు వ్యక్తికి సంబంధించిన కాల్స్‌ లేవని తేలింది. కానీ వాట్సాప్, ఐఎంఓ విధానంలో మాట్లాడినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. మరోవైపు చిన్నారులకు పురుగుల మందు తాగించి హత్య చేసి ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే బలప్రయోగంతోనే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సమగ్ర నివేదిక కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెగ్యులర్‌ వైద్యులతో శవ పంచనామా చేయించారు.

నిందితుడు రవిశంకర్‌ చెబుతున్న వివరాలను, నివేదికలో అంశాలను సరిపోల్చుకుంటూ పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రవి శంకర్‌ను అరెస్ట్‌ చేయడంతో తదుపరిచేయాలనుకున్న రెండు హత్యలకు బ్రేక్‌ పడినట్లైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *