ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం దగ్గర మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయ పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. రాత్రి సమయంలో ప్రధాన ఆలయంపై డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఆలయ అధికారుల అనుమతిలేకుండా ఆలయంపై డ్రోన్లు చక్కర్లు కొడుతున్నా సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి బయటపడిన భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీశైలం క్షేత్ర పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. సోమవారం సెప్టెంబర్8 రాత్రి సమయంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయం ప్రధాన గోపురం సమీపంలోని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. దాన్ని గమనించిన దేవస్థానం సెక్యూరిటీ చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు వెంటనే అలర్టయ్యారు. విషయాన్ని తమ సిబ్బందితో చెప్పి అప్పటికప్పుడు డ్రోన్ ఎగురుతున్న ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే ఆ డ్రోన్ అక్కడి నుంచి కనపడకుండా వెళ్లిపోవడంతో దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ డ్రోన్ కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు.
దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఎగర వేస్తున్న వారి కోసం ఆలయ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయ దర్శనానినిక వచ్చిన యాత్రికులు ఎవరైనా డ్రోన్ ఆపరేట్ చేశారా..? లేక ఇంకెవరైనా డ్రోన్స్ ఎగరవేశారా అని ఆలయ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఆలయ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ ఎగరవేసిన వారిని పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.