మూఢనమ్మకాల అనుమానం, భూతగాదాలతో కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కుమారుడు. తండ్రి ఒంటరిగా పొలం వద్ద పనులు చేస్తుండగా తన మేనల్లుడితో పాటు అక్కడికి వచ్చిన కుమారుడు తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తల, మొండెం వేరు మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ లో వృద్ధుడు చాగొండ బాలయ్య నివాసం ఉంటున్నాడు. బాలయ్యకు ముగ్గురు కుమారులు. ఇందులో ఒకరు గతంలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరి కుమారులకు పెళ్లిలు అయ్యాయి. ఎవరి సంసారాన్ని వారు విడిగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక బాలయ్య స్థానికంగానే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోజు మాదిరిగానే ఈనెల 3వ తేదీన మధ్యాహ్నం గం.3.00లకు తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే రాత్రైన బాలయ్య ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పెద్ద కుమారుడు మల్లయ్యకు సమాచారం ఇచ్చింది. దీంతో మల్లయ్య పొలం వద్దకు వెళ్లి చూడగా… తండ్రి బాలయ్య స్కూటీ పక్కనే ఉన్న చిన్న కుమారుడు బీరయ్య పొలం షెడ్డు వద్ద కనిపించింది. అయితే గడచిన కొన్ని నెలలుగా తండ్రి బాలయ్య, కుమారుడు బీరయ్య మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఇరువురు మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలో బాలయ్య ద్విచక్ర వాహనం అక్కడ ఉండడం అనుమానాలను రేకెత్తించింది. వెంటనే షెడ్డు వద్దకు వెళ్లి చూడగా అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. చుట్టూ పక్కల మొత్తం వెతికిన ఎక్కడ ఎవరు కనిపించలేదు.
పోలీసులకు దర్యాప్తులో వెలుగులోకి ఘాతుకం:
ఇక ఈ మొత్తం వ్యవహారంపై మరునాడు ఉదయం కల్వకుర్తి పోలీసులకు పెద్ద కుమారుడు మల్లయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్న కుమారుడి పొలం వద్ద ఉన్న షెడ్డు, రక్తపు మరకలను గమనించి అక్కడే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. తండ్రి బాలయ్యపై కుమారుడు బీరయ్య కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపిన దృశ్యాలను చూసారు. దీంతో బాలయ్యను కుమారుడే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తండ్రి బాలయ్యను కొట్టి చంపిన తర్వాత వరుసకు మేనల్లుడు అయ్యే వోరే అంజిని కారు తీసుకునిరమ్మని చెప్పాడు బీరయ్య. ఈ మొత్తం వ్యవహారాన్ని బాలయ్య జీతగాడు రామచంద్రి చూసాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బీరయ్య బెదిరించడంతో అక్కడి నుంచి రామచంద్రి పారిపోయాడు.
ఇక అంజి కారు తీసుకొని రాగానే డెడ్ బాడీని డిక్కిలో వేసుకొని చింతపల్లి డీఎల్ఐ కాల్వ వద్దకు వెళ్లారు. చీకటి పడే వరకు అక్కడే ఉండి.. చెట్ల పొదల్లో అక్సల్ బ్లేడ్ సహాయంతో తండ్రి బాలయ్య తల, మొండం వేరు చేశారు. అనంతరం తండ్రి చెవులకు ఉన్న నాలుగు బంగారు పోగులను తీసుకున్నారు. తర్వాత డీఎల్ఐ కాలువలో తలను, డిండి చింతపల్లి వాగులో మొండంను పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
పక్కా నిఘాతో నిందితులను పట్టుకున్న పోలీసులు:
నిందితులను గుర్తించిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. నమ్మదగిన సమాచారంతో కల్వకుర్తి పట్టణ సమీపంలో ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. అనంతరం నిందితుల సమాచారం మేరకు డెడ్ బాడీ భాగాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. అయితే బీరయ్య కుమార్తె మూడు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తండ్రి బాలయ్య చేతబడి చేయించి తన కుమార్తెను చంపించాడని బీరయ్య అనుమానం పెట్టుకున్నాడు. దీనికి తోడు బీరయ్య తల్లిపై ఉన్న భూమి అంశంలోనూ తండ్రీ, కొడుకుల మధ్య తగాదాలున్నాయి. ఈ రెండు కారణాలచేతనే తండ్రి బాలయ్యను కుమారుడు బీరయ్య చంపాడని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు.