అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ అగరబత్తులపై 60 యోగా ఆసనాలను గీసి అందరినీ అబ్బురపరిచాడు. యోగా అనేది ప్రతి ఒక్కరి దిన చర్యలో ఒక భాగం కావాలనే సందేశంతో చిత్రకారుడు కోటేష్ గీసిన ఆసనాల చిత్రాలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. అలాంటి వారు తమ ప్రతిభతో ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా నంద్యాల పట్టణానికి చెందిన ఓ చిత్రకారుడు కోటేష్ సైతం తన చిత్రకళతో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. శనివారం11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అగరబత్తులపై 60 యోగా ఆసనాలను గీసి అందరినీ అబ్బురపరిచాడు. ఇంత సన్నటి అగరబత్తులపై యోగాసనాలు గీసేందుకు కోటేష్ సుమారు మూడు గంటల కష్టపడ్డారు. చివరకు ఎంతో అద్భుతంగా అగరబత్తులపై యోగాసనాలను గీశాడు. కోటేష్ గీసిన చిత్రాలను చూసిన ప్రతి ఒక్కరు అతను టాలెంట్‌ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ.. ధ్యానం, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు అన్ని యోగా లోని భాగమే అని అన్నారు. ప్రతి రోజు యోగా చెయ్యడం ద్వారా ఒత్తిడిని జయించి, ఏకాగ్రతను పెంచుకోవచ్చున్నారు. యోగా సాధనతో మనిషి శరీరంలో ఎముకలు, కండరాలు దృఢంగా ఉండటంతో పాటు మెదడు చురుకుగా పని చేస్తూ మతిమరుపు తగ్గిస్తూందన్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యం పొండాలంటే యోగా చెయ్యడం ద్వారానే సాధ్యమని కోటేష్ చెప్పుకొచ్చారు.
భారత దేశంలో యోగా వారసత్వ సంపద అని, యోగాను వేల సవత్సరాల నుండి మహాఋషులు, మహనీయులు ఇలా ఎంతో మంది యోగాను ఆచరించి ఆరోగ్యంగా వందల సవత్సరాలు జీవించారని మన చరిత్ర చెబుతుందన్నారు. 2014వ సంవత్సరంలో ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిందని, దాన్ని ప్రతిపాధన చేసింది మన భారత దేశమే అన్నారు. ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోటేష్ పిలుపునిచ్చారు.