పార్టీ ఆఫీసంటే అది కార్యకర్తల కార్యాలయమే అన్నారు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎంని కలవాలంటే అప్పాయింట్‌మెంట్ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీసు కన్నా టీడీపీ ఆఫీస్ పెద్దగా ఉందన్నారు లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ NDA అభ్యర్థికి ఎందుకు ఓటేసిందో వైఎస్ జగన్‌నే అడగాలన్నారు లోకేష్. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ మద్దతు ఉంటుందన్నారు. కేటీఆర్‌ని కూడా కలుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి కలవాల్సిన అవసరం లేదన్నారు. కవితను టీడీపీలో తీసుకోవడమంటే.. జగన్‌ని పార్టీలో చేర్చుకోవడమేనంటూ చిట్‌చాట్ చేశారు నారా లోకేష్.
రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయన్న లోకేష్.. అన్నీ బయటికొస్తాయన్నారు. వైసీపీ నేతలెవరూ అవినీతి జరగలేదని చెప్పడం లేదు. దొరికిపోతానన్న భయంతోనే జగన్ బెంగుళూరులో ఉన్నారన్నారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తోందని.. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారన్నారు లోకేష్. ఢిల్లీ టూర్‌లో ఉన్న నారా లోకేష్ ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు పనితీరును ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను బూత్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని సూచించారన్నారు. స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయాలని ప్రధాని చెప్పారన్నారు లోకేష్.