ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూ పరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి.
నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది L -బ్యాండ్, S-బ్యాండ్ SAR టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌ను భూమికి పంపించనుంది. నిసార్‌కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫొటోలను తీసే సామర్థ్యం ఉంది.
ఉపగ్రహ స్కాన్లు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, నేల తేమ, వ్యవసాయ నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంలో నిసార్ సాయపడనుంది. తీరప్రాంతం, కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అధిక రెజల్యూషన్ ఫొటోలు, డేటా అందించడం నిసార్ ప్రత్యేకత. నిసార్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
‘నిసార్ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్‌ను నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలూ స్పష్టమైన ఫొటోలు తీసి భూమికి పంపగలదు. మట్టి పెళ్లలు విరిగిపడటం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదు.