దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికాల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్-యూజీ 2025 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.9999547 పర్సంటైల్ స్కోరుతో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియా 99.9999095 పర్సెంటేల్‌తో సెకండ్ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషి 99.9998189 పర్సెంటేల్‌తో థార్డ్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. అమ్మాయిల్లో ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ 5వ ర్యాంకు సాధించింది అమ్మాయిల విభాగంలో టాపర్‌గా నిలిచింది.
టాప్ 10లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులకు చోటు దక్కకపోయినా 20లో ఇద్దరు, టాప్ 100లో 11 మంది ర్యాంకులు సాధించారు. ఇందులో ఏపీ ఆరుగురు, తెలంగాణలో ఐదుగురికి ర్యాంకులు దక్కాయి. తెలంగాణలోని తణుకుకు చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ 18వ ర్యాంకు సాధించి రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాడు. జీవన్ మొత్తం 720 మార్కులకుగానూ 670 మార్కులు అంటే 99.99 పర్సంటైల్ సాధించాడు. వందలోపు 37 (షణ్ముఖనిషాంత్ అక్షింతల), 46 (మంగారి వరుణ్), 48 (యండ్రపాటి షణ్ముఖ్), 95 (బిదిష మజీ) ర్యాంకులు తెలంగాణ విద్యార్థులకు వచ్చాయి.
ఏపీకి చెందిన డి.కార్తీక్‌రామ్ కిరీటి ఆల్ ఇండియా స్థాయిలో 19వ ర్యాంకు సాధించాడు. ఇతడు ఏపీలో రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. అలాగే మొదటి 100లోపు ర్యాంకుల్లో 56 (కె మోహిత శ్రీరామ్), 59 (డి సూర్యచరణ్), 64 (పి అవినాష్), 70 (వై సమీర్ కుమార్), 92 (టి శివమణిదీప్) ర్యాంకులు ఏపీ విద్యార్థులకు దక్కాయి. వీరుగాక కారు మంచి విక్రాంత్ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు. ఎన్‌టీఏ ఈ మేరకు శనివారం (జూన్ 14) ర్యాంకులను ప్రకటించింది. ఏపీ నుంచి నీట్ యూజీ పరీక్షకు 57,934 మంది పరీక్ష రాయగా, 36,776 (63.48 శాతం) మంది కనీస అర్హత మార్కులు సాధించారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి మార్కులు తక్కువగా వచ్చాయి. అయినప్పటికీ అభ్యర్ధులకు ర్యాంకులు మెరుగ్గానే వచ్చాయి. గతేడాది అఖిల భారత స్థాయిలో 502 మార్కులకు 2 లక్షల ర్యాంకు వస్తే.. ఈసారి 405 మార్కులు వచ్చిన వారికి అదే 2 లక్షల ర్యాంకు రానుంది.