దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. టాయిలెట్‌కు వెళ్లి నీళ్లు పోయలేదని ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చారు. గోవింద్‌పురిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరుగుదొడ్డి పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ఇరుగుపొరుగు వారి మధ్య గొడవలు జరిగాయి. అర్థరాత్రి వివాదంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది.
మృతులు, నిందితులు ఇరుగుపొరుగు వారని పోలీసులు తెలిపారు. ఒకే భవనంలోని మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. అయితే వారికి ఉమ్మడి టాయిలెట్ ఉంది. దీంతో పరిశుభ్రతపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సుధీర్ అనే యువకుడిపై భికం సింగ్ కుటుంబసభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు నిందితుడు భికం సింగ్, అతని భార్య మీనా, వారి ముగ్గురు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుధీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతని సోదరుడు ప్రేమ్, స్నేహితుడు సాగర్ గాయపడ్డారు. గాయపడ్డ వారిద్దరినీ పోలీసులు ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేర్చారు.
ఢిల్లీలోని గోవింద్‌పురి స్ట్రీట్ నంబర్ 6లోని బిల్డింగ్ 482లోని మొదటి అంతస్తులో సుధీర్ తన సోదరుడు, స్నేహితుడితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. వారి ముందు భికం సింగ్ కుటుంబం ఉంటోంది. సుధీర్ బిల్డింగ్ మెటీరియల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకే టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నారు. భికం సింగ్ కుటుంబసభ్యులు టాయిలెట్‌ను ఉపయోగించుకుని ఫ్లష్ చేయకపోవడంతో గొడవ మొదలైంది. దీనిపై సుధీర్, భికం సింగ్‌ను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు ఇరుగుపొరుగు వారు పరస్పరం ఘర్షణ పడ్డారు. భికం, అతని భార్య, కుమారులు కలిసి సుధీర్‌ను, అతని సోదరుడు స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఏకంగా కత్తితో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సుధీర్, అతని సోదరుడు ప్రేమ్, వారి స్నేహితుడు సాగర్‌ను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేర్చారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సుధీర్ మృతి చెందగా, ప్రేమ్‌కు గాయాలయ్యాయి. చికిత్స అనంతరం సాగర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. మృతుడి ఛాతీపై గుండె దగ్గర, ముఖం, తలపై కత్తితో దాడి చేసిన గుర్తులు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేసన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు.