ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారును ఢీకొట్టిన తరువాత కారును చాలా దూరం వరకు లాక్కెంది టిప్పర్.. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టినట్లు చెబుతున్నారు పోలీసులు. కారు నెంబర్ AP 40HG 0758 నెల్లూరుకి చెందిన తాళ్లూరు రాధ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు చెబుతున్నారు. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
మృతులు తాళ్లూరు రాధ (38), తాళ్లూరు శ్రీనివాసులు (40), సారమ్మ ( 40), వెంగయ్య ( 45), లక్ష్మి (30), డ్రైవర్ గా తెలిపారు. ఈ ప్రమాదంలో చిన్నారి కూడా మరణించింది. కారును స్పీడుగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో.. కారు నుజ్జునుజ్జు అయింది.
కాగా.. సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పెరమన వద్ద టిప్పర్- కారు ఢీకొని ఏడు మంది మృతి చెందడం అత్యంత బాధాకరం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ ఘటనతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది..