జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రెగ్యులర్ తరగతులకు హాజరు కాకుండా బోర్డు పరీక్షలకు నమోదు చేసుకునే డమ్మీ విద్యార్థులు, తగిన సౌకర్యాలు లేకుండా అనుమతి లేని సబ్జెక్టులను అందించే పాఠశాలలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు హాజరుకాని విద్యార్థుల కోసం వీటిని తీసుకువచ్చినట్లు బోర్డు పేర్కొంది..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ప్రకటన వెలువరించింది. కఠినమైన విద్యా పనితీరు, కనీస అటెండెన్స్ లేకుండా ఏ విద్యార్థి పరీక్షలు రాయడానికి వీలులేదంటూ స్పష్టం చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని CBSE ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి వీటిని జారీ చేసింది. రెగ్యులర్ తరగతులకు హాజరు కాకుండా నమోదు చేసుకునే డమ్మీ విద్యార్థులు, తగిన సౌకర్యాలు లేకుండా అనుమతి లేని సబ్జెక్టులను అందించే పాఠశాలలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు హాజరుకాని విద్యార్థుల కోసం వీటిని తీసుకువచ్చినట్లు బోర్డు పేర్కొంది.
సీబీఎస్సీ బోర్డు నూతన మార్గదర్శకాలు ఇవే..
- CBSE అధికారికంగా పదవ తరగతి, పన్నెండో తరగతిని రెండేళ్ల ప్రోగ్రామ్‌లుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. అంటే తొమ్మిదవ తరగతి, పదో తరగతి కలిసి 10వ తరగతి పరీక్షకు పూర్తి కోర్సుగా ఏర్పడతాయి. అలాగే 11వ తరగతి, పన్నెండో తరగతి కలిసి 12వ తరగతి పరీక్షకు పునాదిగా నిలుస్తాయి. బోర్డు తరగతుల్లో తీసుకున్న ఏదైనా సబ్జెక్టు వరుసగా రెండు సంవత్సరాలు చదివి ఉండాలి.
- ఆలస్యంగా చేరడం లేదా ఫౌండేషన్ తరగతులను దాటవేసే విద్యార్ధులు బోర్డు పరీక్షలకు అనర్హులు.
- బోర్డు పరీక్షలకు అర్హత సాధించాలంటే విద్యార్థుల కనీస హాజరు 75 శాతం కలిగి ఉండాలి. ఈ మేరకు పాఠశాలలు రోజువారీ రిజిస్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది.
- వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, జాతీయ స్థాయిలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటి తీవ్రమైన పరిస్థితులలో మాత్రమే 25 శాతం వరకు హాజరు మినహాయింపు ఉంటుంది. అయితే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ ఉండాలి.
- హాజరు తక్కువగా ఉండి, సరైన కారణాలు లేని విద్యార్థులు రెగ్యులర్ అభ్యర్థులుగా నమోదు చేసుకున్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా అనర్హులుగా గుర్తిస్తారు.
- NEP-2020 ప్రకారం అంతర్గత మూల్యాంకనాలు ఇకపై ఐచ్ఛిక యాడ్-ఆన్ కాదు. ఇంటర్నర్ అసెస్‌మెంట్ (అంతర్గత మూల్యాంకనం) రెండు సంవత్సరాల పాటు నిర్వహించబడుతుంది.
- పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కాని విద్యార్థులు ఈ మూల్యాంకనాలను కోల్పోవల్సి ఉంటుంది.
- అంతర్గత మూల్యాంకన రికార్డులు లేకుండా, CBSE ఫలితాలను ప్రకటించదు. అటువంటి విద్యార్థులు థియరీ పరీక్షలకు హాజరైనప్పటికీ ‘ఎసెన్షియల్ రిపీట్’ విభాగంలో ఉంచబడతారు.
- పదవ తరగతి విద్యార్థులు తప్పనిసరి ఐదు సబ్జెక్టులకు అదనంగా మరో రెండు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.
- పన్నెండో తరగతి విద్యార్థులు ఒక అదనపు సబ్జెక్టును మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండేళ్ల ప్రోగ్రామ్ అంతటా వీటిని చదవవల్సి ఉంటుంది.
- ఉపాధ్యాయులు, CBSE స్కూల్ అధికారిక అనుమతి లేకపోతే విద్యార్థులు ప్రధాన లేదా అదనపు పేపర్ల సబ్జెక్టులను నమోదు చేసుకోవడానికి అనుమతి ఉండదు.
- గతంలో అదనపు సబ్జెక్టులను ఎంచుకున్న విద్యార్థులు కంపార్ట్‌మెంట్ లేదా ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీలలో ఉంచబడిన వారు ప్రైవేట్ అభ్యర్థులుగా పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- నిర్దేశించిన రెండేళ్ల అధ్యయనం, హాజరు నిబంధనలను పాటించని విద్యార్థులు ప్రైవేట్ అభ్యర్థులుగా అదనపు సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనర్హులు.
రెండేళ్ల తరగతి గది అభ్యాసం, తప్పనిసరి హాజరు, నిరంతర అంతర్గత మూల్యాంకనంతో అనుసంధానించడానికి CBSE 360-డిగ్రీల విధానాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్కరణలు NEP-2020కి అనుగుణంగా ఉన్నాయి. ఇది బట్టీ విధానం, పరీక్ష-కేంద్రీకృత అభ్యాసం కంటే సమగ్రమైనది. సంవత్సరం పొడవునా మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇస్తుంది.