ఆకస్మిక మరణాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ తో ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది. ICMR, AIIMS చేసిన అధ్యయనాలలో కోవిడ్-19 వ్యాక్సిన్లకి ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాసేపట్లో పెళ్లి అందరూ సంతోషంగా ఉన్న వేళ వరుడు కుప్పకూలి చనిపోతాడు..100 కేజీల బరువెత్తె సామర్థ్యం ఉన్న యుకుడు జిమ్ చేస్తూ అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతాడు. సరదాగా ఫ్రెండ్స్ తో ప్లే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ గుండె నొప్పితో యువకుడు నేలరాలుతాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమని ప్రచారం జరుగుతోంది. కొంతమంది అదే నిజమని నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో ఆకస్మిక మరణాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది. ICMR, AIIMS చేసిన అధ్యయనాలలో కోవిడ్-19 వ్యాక్సిన్లకి ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2021 అక్టోబర్ నుంచి మార్చి 2023 మధ్య ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై వైద్యులు విస్తృత అధ్యయనాలు చేశారు.
ఈ క్రమంలో COVID-19 టీకా యువకులలో ఆకస్మిక మరణ ప్రమాదాన్ని పెంచదని వైద్యులు నిర్ధారించారు. యువతలో గుండెపోటుకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (MI) ప్రధాన కారణంగా గుర్తించారు. అంతేకాకుండా అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకరమైన జీవనశైలి, కోవిడ్ తర్వాత సమస్యలతో ఆకస్మిక గుండె మరణాలు సంభవించవచ్చని ప్రాధమిక అధ్యయనాల్లో వెల్లడైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవనీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కారణమనే వాదనలన్నీ తప్పని..ఇటువంటి ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని సూచించింది.