వెర్రితలలు వేస్తున్న ‘విలనిజం’.. పాతికేళ్ల కుర్రాడి నుంచి యాభై ఏళ్ల బామ్మదాకా..!

మాయమైపోతున్నాడమ్మ..మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ కవి ఈ స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశాడు. నిజమే.. మనిషి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. క్షణికావేశంలో, అనుమానపు పొరల్లో, పేగుబంధాన్ని సైతం చూడలేని కర్కశత్వంతో ప్రవర్తిస్తున్నాడు మనిషి. సమాజంలో ఈ పోకడలు కారణాలేంటో చెప్పుకుందాం..

చిన్నప్పుడు ఎత్తుకుని చాక్లెటిచ్చిన తాతకు.. కసితీరా కత్తిపోట్లు, ఇంటికి రాగానే ఆప్యాయంగా అన్నం పెట్టే ఇల్లాలికి రోకటిపోటు.. ముద్దుముద్దుగా అమ్మా, నాన్నా అని పిలిచే కన్నపేగుకు ఒంటిపై అక్రమ సంబంధాల వాతలు..! ఏరా సిట్టింగ్‌కు రెడీయా అని పిలిచే దోస్త్‌కు ఆ కొద్దిసేపటికే భూమిపై నూకలు చెల్లు..! అంతా మనుషులే.. రోజూ మన మధ్య తిరిగే వాళ్లే.. పైకే నవ్వులు.. కడుపు నిండా కత్తులు.. ఎప్పుడు ఎవడు ఏ కారణంతో ఎవరిని అంతం చేస్తారో తెలియని మాయా ప్రపంచం..! అమ్మాయి కోసం ఒకడు.. ఆస్తి కోసం మరొకడు.. అక్రమసంబంధం మోజులో ఇంకొకడు.. మానవసంబంధాలను మారణహోమంలో ముంచేస్తున్నారు.

వెర్రితలలు వేస్తున్న విలనిజం

పాతికేళ్ల కుర్రాడి నుంచి యాభై ఏళ్ల బామ్మదాకా అందరిలో విలనిజం వెర్రితలలు వేస్తోంది. అంతేకాదు… ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలకు కారణం ఏంటని.. దాని మూలాలను వెతుకుతూ వెళ్తే కనిపిస్తున్న అడ్రస్‌ ‘ఇల్లు’. నానమ్మ కళ్లలో ఆనందం కోసం చెల్లెలి భర్తనే చంపేశారు. వయసుమళ్లిన తరువాత శాంతంగా, ప్రశాంతంగా ఉండాల్సిన నాయనమ్మే.. మనవళ్లకు పగను నూరిపోయడం వల్ల జరిగింది కాదా ఆ ఘోరం..! వంద మంది అమ్మాయిలను అనుభవించడమే లక్ష్యమట. ఆ టార్గెట్‌ మరిచిపోకుండా ఉండేందుకు ఏకంగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు ఛాతి మీద. అంతటి ఉన్మాదం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఢిల్లీలో నిర్భయపై జరిగిన ఘోరం గానీ, హైదరాబాద్‌లో దిశపై జరిగిన అఘాయిత్యం గానీ.. ఆ నేరం చేసిన వాళ్ల మానసిక స్థితి, వాళ్ల నేపథ్యం, పెరిగిన వాతావరణాన్ని అధ్యయనం చేసే అవకాశం రాలేదు గానీ.. ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేసుంటే గనక.. ఆ మూలాలు వాళ్ల ఇంటి దగ్గరకే వెళ్తాయి.

నేరాలు-ఘోరాలకు కారణం ఏంటి..?

చెబితే ఆశ్యర్యం వేస్తుంది గానీ.. మానసిక వైద్యులు, విశ్లేషకులు ఈ నేరాలు-ఘోరాలకు కారణం ఏంటని అడిగితే మేజర్‌గా ఏం చెబుతున్నారో తెలుసా. పిల్లల ముందే భార్యాభర్తల గొడవలు, పిల్లల ముందే భార్యను అవహేళన చేయడాలు, ఇలాంటి పనులు మగపిల్లలు చేయొద్దు ఆడపిల్లే చేయాలని చెప్పడాలు, ‘స్కూల్లో మీ పిల్లాడి ప్రవర్తన కాస్త భిన్నంగా ఉందని టీచర్లు చెప్పినా.. మగ పిల్లలన్నాక అలాగే గొడవ చేస్తారు’ అని సమర్ధించడాలు.. ఈ చిన్నచిన్న కారణాలే సమాజాన్ని దారి తప్పించిన అతిపెద్ద కారణాలుగా మారుతున్నాయని చెబుతున్నారు. అసలు.. హత్య చేయడానికి, అత్యాచారం చేయడానికి, కన్నవాళ్లనే చిదిమేయడానికి, కట్టుకున్నవాళ్లనే అంతమొందించడానికి.. వీటన్నింటికీ కారణాలున్నాయ్. మనిషి మృగంగా ఎప్పుడు, ఎందుకు మారతాడనడానికి కొన్ని లెక్కలున్నాయి.

రక్తసిక్తమవుతున్న జీవితాలు..!

ఆస్తి ఇవ్వలేదని తాతను పొడిచాడు. ఒక్కసారి కాదు 73 సార్లు పొడుస్తూనే ఉన్నాడు కసిగా. తల్లి అని కూడా చూడకుండా అడ్డొచ్చిన ఆమెపైనా కత్తితో పొడిచేశాడు. మనిషిలో మానవత్వం మాయమవుతోందని చెప్పడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. అసలు.. మానవత్వం మానవత్వం అని గొంతుచించుకుంటూ అరుచుకుంటూ వెళ్తున్నాం గానీ.. కనీసం పశుత్వం అయినా మనిషిలో ఉందా అనేదే అనుమానం. భార్యను ముక్కలుముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించి, ఎముకలు పొడి చేసి, చెరువులో పడేశాడట. మనసులో ఎంత పశుత్వం ఉంటే అంత పనిచేయగలడు. మానిప్యులేటర్స్‌ అనే పదాన్ని ఈమధ్య క్రైమ్‌లో కూడా వాడుతున్నారు. సైకాలజిస్టులు క్యాటగరైజ్‌ చేసిన సైకో మెంటాలిటీస్‌.. ఈ మానిప్యులేటర్స్‌. ఎలా ఉంటారంటే వీళ్లు. మాటలతోనే మత్తుజల్లుతుంటారు.

పైకి రాముడు.. లోపల రాక్షసుడు..!

పైకి ఎంత మంచివాళ్లుగా ఉంటారంటే.. ‘రాముడు మంచి బాలుడు’ అనే ట్యాగ్‌ లైన్‌ కూడా సరిపోదు. తన మాటలతో, తమ మంచితనంతో ఎదుటివాళ్లని మానిప్యులేట్ చేస్తుంటారు. ఎప్పుడు టెస్ట్‌ చేసినా సరే.. మంచితనం కారిపోతుంటుంది వాళ్ల నుంచి. మస్తాన్‌సాయి అలాంటివాడే అంటుంటారు సైకాలజిస్టులు. అవకాశం రానంత వరకు మంచితనమే పైకి కనిపిస్తుంది. అవకాశమే చేతుల్లోకి వచ్చిన క్షణాన రాక్షసత్వం బయటపడుతుంది. అలా మానిప్యులేట్‌ చేశాడు కాబట్టే ఆడపిల్లల జీవితాలతో మస్తాన్‌ సాయి ఆడుకుంటూపోయాడని చెబుతున్నారు మానసిక వైద్యులు. ప్రభాకర్‌ అనే సైకోమెంటాలిటీ ఉన్నవాడిని ఈ మధ్యే చూశాం. వంద మంది అమ్మాయిలే టార్గెట్‌ అట. ఎంత మానిప్యులేటర్‌ కాకపోతే.. అంతమందిని లక్ష్యంగా పెట్టుకుంటాడు. మాటలు, మంచితనాన్ని అడ్డుపెట్టి ఎంతమంది అమ్మాయిలను నమ్మించి మోసం చేసి ఉంటాడు. మీర్‌పేటలో భార్యను కిరాతకంగా చంపిన గురుమూర్తినే చూడండి. ఆ చుట్టుపక్కల ఎవరిని అడిగినా సరే.. ‘అరె.. అతను చాలా మంచివాడే, ఇలా ఎలా చేశాడు, అసలు అంత దారుణమైన పని చేస్తాడని ఊహించనే లేదు’ అనే చెప్పారంతా. హీ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్‌ మానిప్యులేటర్.

నమ్మిన వాళ్లే టార్గెట్..!

ఎదుటివారిని నమ్మించగలిగినప్పుడే మోసం చేయొచ్చు. అత్యంత దారుణాలు జరిగేది కూడా నమ్మిన వాళ్ల దగ్గరే. ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఓ అమ్మాయిని.. తనపై నమ్మకం పెరిగేంతగా నటించాడు ఓ యువకుడు. ఇంట్లో ఫంక్షన్‌ ఉందని చెప్పి, ఆ అమ్మాయిని రప్పించాడు. ఇంట్లో ఫంక్షన్‌ జరగడం లేదని తెలిసినా సరే.. అక్కడే తన కాలేజ్‌లో చదువుతున్న మరో యువకుడిని చూసి ఏం కాదులే అని నమ్మిందా అభాగ్యురాలు. ఆ నమ్మకమే, అలా నమ్మడం వల్లే ఆ తరువాత నరకం చూసింది. పిలిచిన వ్యక్తి ప్లస్‌ ఆ తోటి విద్యార్ధి.. ఇద్దరూ బయట కాపలాగా ఉంటే.. మూడో వ్యక్తి వచ్చి అత్యాచారం చేశాడు. పైగా ఆ అరుపులు బయటకు వినించకుండా సౌండ్‌ బాక్సులు పెట్టారట. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో జరిగిందీ దారుణం.

పసిపిల్లలను సైతం వదలని సైకోయిజం..!

ఇదనే కాదు.. చిన్న పిల్లలపై, మైనర్లపై అఘాయిత్యాలు చేసేది అలా నమ్మించే వాళ్లే. అన్న కదా, అక్కా అని పిలిచాడు కదా, బాబాయ్‌, పెదనాన్న, తాతే కదా అని నమ్మకంతో వెళ్లినందుకు ఎంతమంది ఆడపిల్లలు బలైపోతున్నారో. ఆ పశుప్రవృత్తికి కారణం.. ‘విషయం బయటకు తెలిస్తే తమ పరువే పోతుందని స్వయంగా తల్లిదండ్రులే భయపడడం’. కామాంధుల బలం కూడా అదే. బయటకు చెప్పుకోలేరు అనే అస్త్రాన్ని ప్రయోగించి.. అయినవాళ్లనే, వావివరసలు మరిచి ప్రవర్తిస్తుంటారు. కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయ్. NCRB-2016 రిపోర్ట్‌ ప్రకారం మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార కేసుల్లో.. 94 శాతం దోషులు ఆ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లు, దగ్గర వాళ్లే. ఆ దోషులలో 29 శాతం మంది ఇరుగుపొరుగు వాళ్లు, 27 శాతం పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చిన వాళ్లు, 6 శాతం బంధువులు, మిగతా 30 శాతం ఆ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేవాళ్లు. సో, ఒక్కోసారి నమ్మకమే ప్రమాదకరం.

మృగంలా మారతున్న మనిషి..!

ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన జంతువుగా మారగలిగేది ఒక్క మనిషి మాత్రమే. రెండు కాళ్లతో పుట్టి నాలుగు కాళ్ల జంతువుగా మారేది మనిషి ఒక్కడే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇద్దరు పసిపిల్లలను కొట్టిన తీరు చూసి.. వైద్యం చేసిన డాక్టర్లే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా కొట్టడానికి మనసెలా వచ్చిందని. పిల్లల్ని అలా కొట్టడానికి కారణం ఏంటో తెలుసా. వివాహేతర సంబంధం. తన వ్యవహారానికి పిల్లలు అడ్డొస్తున్నారని ఫోన్‌ ఛార్జర్‌ వైర్‌తో కొడుతుంటే.. చర్మం చిరిగిపోయి, రక్తం బయటకు చిమ్మింది. అక్కడితో ఆగలేదు. ఆ గాయాలపై కారం పూశారట. 9 ఏళ్ల బాలుడు అనుభవించిన టార్చర్‌ వింటే ఎవరికైనా కన్నీళ్లొస్తాయ్. ఆ బాలుడి చెల్లెలు.. వయసు ఐదేళ్లుంటాయి.. ఆ చిన్నారిని కూడా వాతలు తేలేలా కొట్టాడు. ఆ అడ్డమైన సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారన్న కోపంతో చేసిన దుర్మార్గం ఇది.

దరిచేరని దయా దాక్షిణ్యాలు..

‘జాతివైరాన్ని మరిచిన జంతువులు’ అని ఒక్కోసారి కొన్ని వీడియోలు చూస్తుంటాం. లేడిపిల్ల దగ్గరకు వచ్చినా సరే పులి ఏమీ చేయకుండా దాన్ని నాకుతూ ఉంటుంది ఆప్యాయంగా. అలాంటిది కడుపున పుట్టిన వారినే దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులున్నారు. 14 ఏళ్ల కొడుకుపై పిడిగుద్దులు కురిపించాడో తండ్రి. ఛాతిపై తట్టుకోలేనంత తీవ్రతతో పిడికిలి బిగించి మరీ బాదాడు. అంత దెబ్బ తగిలితే పిల్లాడు ఉంటాడా. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం.. తన కొడుకు రాత్రి 8 అయినా ఇంటికి రాకపోవడం. ‘నాన్నా స్కూల్లో ఫేర్‌వెల్‌ పార్టీ జరిగింది.. కాస్త ఆలస్యం అయింది’ అని చెబుతున్నా వినకుండా కొట్టడంతో తొమ్మిదో తరగతి చదివే ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిందిది.

స్పందించే గుణాన్ని కోల్పోయిన మనసులు

గుంటూరులో ఆమధ్య బీటెక్ స్టూడెంట్ రమ్యను నడిరోడ్డుపై చంపేశాడో శాడిస్టు. చుట్టూ పదుల మంది ఉన్నారు. ఏ ఒక్కరూ ఆ దారుణాన్ని ఆపలేదు. పొట్టలో, గొంతుతో, పొత్తికడుపులో కసితీరా పొడుస్తుంటే.. జనం వేడుక చూసినట్టు చూశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌ చూసినప్పుడు.. ‘ఏం..మనిషిలో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందా’ అనిపిస్తుంది. స్పందించే గుణాన్ని కోల్పోయిన మనసు రాయిలా మారిందా అనిపించిన సందర్భం అది. కత్తి ఎత్తినప్పుడే మానవత్వంతో స్పందించి ఉంటే రమ్య.. కనీసం గాయాలతో బయటపడి ఉండేది. ఏమైంది మనుషులకి. కళ్ల ముందు నిండు ప్రాణం పోతున్నా చలనం లేదెందుకని..!

బాలాసోర్‌లో పరిమళించిన మావనత్వం

2023లో బాలాసోర్‌లో ట్రైన్‌ యాక్సిడెంట్‌ జరిగింది. దాదాపు 300 మంది చనిపోయారు ఆ ఘోర ప్రమాదంలో. ఎటు చూసినా మాంసపు ముద్దలు కనిపిస్తున్న ఆ సమయంలో.. ఒక ఊరుకు ఊరే తరలివచ్చి సెల్ ఫోన్లనే టార్చిలైట్లుగా మార్చి, గాయపడ్డవారిని వెనువెంటనే బైకుల మీద కూర్చోబెట్టుకుని దగ్గర్లోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. నిచ్చెనలు వేసుకుని రైల్లో ఇరుక్కున్న వారికి మంచినీళ్లిచ్చి, ఏం కాదు అని ధైర్యాన్నిచ్చారు. కనీసం 300 మంది పిల్లలను తమ పొత్తిళ్లలో పెట్టుకుని రాత్రంతా కాపాడారు. ఆ క్షతగాత్రులకు రక్తం ఇవ్వడానికి బాలాసోర్ యువకులు రాత్రంతా క్యూలో వెయిట్‌ చేశారు. ఆ ఫోటో దేశమంతా వైరల్ అయింది. ఇదీ మానవత్వం అంటే.

చీర అందించి ఆదుకున్న అపర జగన్మాత..!

బెంగుళూరుకు భారీ వరదలొచ్చిన సందర్భంలో.. ఓసారి అండర్ పాస్‌లోకి నీళ్లుచేరి అందులో కారు ఇరుక్కుపోయింది గుర్తుందా..! కారులో ఆరుగురు ఉంటే అప్పటికే ఒకరు చనిపోయారు. ఎవరైనా కాపాడండి అని చుట్టూ ఉన్నవాళ్లు అరుస్తున్నారు. ఓ జర్నలిస్ట్‌ తాడు కోసం వెతుకుతున్నాడు. ఆలస్యమవుతున్న ప్రతిక్షణం ప్రాణాపాయమే. ఆ సమయంలో.. తన చీరను విప్పి బాధితులను ఆదుకోడానికి అందించిందో ఇల్లాలు..! ఆ చీర సాయంతో ఐదుగురిని ప్రాణాలు కాపాడారు. ఇదీ మానవత్వం అంటే.

వాకర్స్ చేసిన పనికి హాట్సాఫ్

1200కు గాను 1017 మార్కులు సాధించిన ఓ అమ్మాయి.. తన తల్లిని వెంట పెట్టుకుని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ కోసం కోయంబత్తూరు వచ్చింది. కాని, తను వెళ్లాల్సింది చెన్నైలోని క్యాంపస్‌కి. కోయంబత్తూర్-చెన్నై మధ్య దూరం 550 కిలోమీటర్లు. ఉదయం ఎనిమిదిన్నరకల్లా క్యాంపస్‌కి వెళ్లాలి. అప్పటికే సమయం ఉదయం ఏడు గంటలు. కనీసం మధ్యాహ్నం వరకు వెళ్తేగానీ అడ్మిషన్‌ దొరకదు. అందునా, ఆరోగ్యం బాగోలేని తల్లి, ఖర్చులకు కూడా డబ్బుల్లేని పేదరికం. ఆ సమయంలో మార్నింగ్‌ వాకింగ్‌ చేస్తున్న కొందరేం చేశారో తెలుసా..!

అప్పటికప్పుడు తలా కొంత పోగేసి ఫ్లైయిట్‌ టికెట్స్‌ బుక్ చేశారు. అందులో ఒకరు తినడానికి టిఫిన్ తెచ్చారు. ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ తనకు తెలుసంటూ ఒకాయన ముందుకొచ్చి.. ఫలానా విద్యార్ధిని ఆలస్యంగా వస్తుంది, అనుమతించండి అని రిక్వెస్ట్ చేశాడు. మరొకరు ఎయిర్‌పోర్టుకు కారు అరేంజ్ చేశారు. గంటన్నరలో చెన్నైలో దిగగానే.. వాళ్లను రిసీవ్‌ చేసుకోడానికి మరో కారును ఏర్పాటు చేశారు. 12.15 గంటల కల్లా యూనివర్సిటీకి చేర్చారు. ఇదీ మానవత్వం అంటే. ఈ లోకంలో మానవత్వం బతికే ఉంది. కాని, బతికున్న ఆ మానవత్వాన్ని చేజేతులా పీకపిసికి చంపేస్తున్నాడు మనిషి.

గగుర్పాటుకు గురి చేస్తున్న గణాంకాలు!

తెలంగాణనే చూద్దాం. ఒక్క ఏడాదిలోనే కుటుంబ కలహాలతో 229 హత్యలు జరిగాయి. వివాహేతర సంబంధాల కారణంగా 102 హత్యలు, చిన్నచిన్న గొడవల కారణంగా 82, ఆర్థిక వివాదాలతో 53 హత్యలు జరిగాయి. గతేడాది మహిళలపై జరిగిన నేరాలే.. 19వేల 922. వీటిలో సగం వరకట్న వేధింపులే. ఇక అత్యాచార కేసులలో 99.2 శాతం నిందితులు బాధితులకు తెలిసినవారే చేశారంటున్నారు తెలంగాణ పోలీసులు.

ఓవైపు.. కఠిన శిక్షలు ఉన్నా, మరణశిక్షలు విధిస్తున్నా సరే.. ఈ అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. 2012లో నిర్భయ ఘటన జరిగాక.. అత్యాచారాలకు అత్యధికంగా మరణశిక్ష కూడా విధించొచ్చు అంటూ చట్టంలో మార్పులు చేశారు. ఈ శిక్షతో నేరస్తులు భయపడిపోతారని అనుకున్నారంతా. కానీ జరిగిందేమిటో తెలుసా. NCRB రిపోర్ట్స్‌ ప్రకారం.. 2015లో 34వేల 651 అత్యాచార కేసులు, 2016లో 38వేల 947 అత్యాచార కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. 2012లో.. అంటే నిర్భయ ఘటన జరిగిన ఏడాదిలో.. 24వేల 923 సంఘటనలే జరిగాయి. అంటే.. ఉరిశిక్ష పడుతుందన్న భయం కూడా లేదని తేలిపోయింది. పైగా ఇలా అత్యాచార బాధితుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. పోక్సో లాంటి పవర్‌ఫుల్‌ చట్టం ఉన్నప్పటికీ.. కేవలం 3 శాతం కేసులలో మాత్రమే నేరాలుగా నిరూపించగలిగారు. NCRB రిపోర్ట్‌ ప్రకారం.. 2016లో పిల్లలపై అత్యాచారాలకు సంబంధించి 64వేల 138 కేసులు పోక్సో చట్టం కింద నమోదైతే.. కేవలం 3 శాతం కేసులనే నిరూపించగలిగారు. నేరమే నిరూపించలేకపోయినప్పుడు ఎవరిని ఉరి తీస్తారు?

నిత్యకృత్యంగా మారిన అమానుష ఘటనలు

ఒకప్పుడు హత్య జరిగితే అదో సంచలనం అయ్యేది. అత్యాచారం జరిగితే.. ఎటు పోతోంది సమాజం అని నిలదీసే రోజులు కనిపించేవి. మరి ఇప్పుడు. హత్య జరిగిందన్న వార్త సర్వసాధారణ విషయంగా మారింది. అత్యాచార ఘటనలను సైతం లైట్‌ తీసుకుంటున్న రోజులొచ్చాయి. ఢిల్లీలో, కోల్‌కతాలో, హైదరాబాద్‌లో జరిగిన అమానుష ఘటనల విషయంలో తప్ప.. మిగతా వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు జనం. సందర్భం ఏదైనా కావచ్చు గానీ.. సమాజంలో కొందరు మనుషులు మాత్రం మానవత్వం మరిచిపోతున్నారు. బంధాలు, బంధుత్వాలు మరిచి, అనుబంధాలు, అప్యాయతలను పక్కనపెట్టి పశువుల్లా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు.

క్షణికావేశంలో కట్టుకున్న భార్యను చంపేస్తున్నాడు భర్త. తన సుఖానికి అడ్డొస్తున్నాడని భర్తనే హత్య చేయిస్తోంది ఓ భార్య. తండ్రి చనిపోతే ఆ ఉద్యోగం వస్తుందని కనిపెంచిన నాన్ననే చంపేస్తున్న కొడుకులు, కూతుళ్లు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ఆస్తి కోసం కొందరు, వృద్ధులైన తల్లిదండ్రులను పెంచలేక మరికొందరు.. పిల్లలే వాళ్లని కాటికి పంపుతున్నారు. మానవ విలువలు ఏ స్థాయిలో పతనమయ్యాయో చెప్పడానికి ఈ రెండు మూడు నెలల్లో జరిగిన ఘోరాలు చూసినా చాలు.. అర్ధమైపోతుంది. మద్యం మత్తులో కొందరు, డ్రగ్స్‌కు బానిసై మరికొందరు, క్షణికావేశం, పథకం ప్రకారం హత్యలు చేసి తమలోని మృగత్వాన్ని చాటుకుంటున్నారు.

వీటన్నింటికి కారణం ఒక్కటే..!

వీటన్నింటికీ కారణం ఏంటని అడిగితే.. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవడమే అనే సమాధానమే ప్రధానంగా వినిపిస్తోంది. పిల్లల్ని పెంచే పద్దతిలోనే ఏదో లోపం జరుగుతోంది. అటుపైన ప్రతి ఇంట్లోకి వేగంగా దూసుకొచ్చిన ఇంటర్నెట్. ఏ నేరం ఎలా చేయాలో, ఎలా చేస్తే తప్పించుకోవచ్చో చెప్పే సినిమాలు సెల్‌ఫోన్‌ నిండా ఉన్నప్పుడు.. టెస్టోస్టెరాన్‌ స్థాయిని పెంచే ఘాటైన వీడియోలు కళ్లముందే కదలాడుతున్నప్పుడు.. ఇక నేరాలు జరక్కుండా ఉంటాయా? అయినా లోపం.. ఇంటర్నెట్‌తో, రెచ్చగొట్టే వీడియోలది మాత్రమే కాదు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరులోనే లోపం ఉంది. యూరప్‌లోని కొన్ని దేశాల్లో జైళ్లనే ఎత్తేశారు. కారణం.. అక్కడ నేరాలు జరక్కపోవడమే. అంటే ఏంటీ అర్థం. మనిషి సంతృప్తిగా జీవించినప్పుడు, ఆ మనిషి సంతృప్తికరంగా జీవించేలా ప్రభుత్వాలు సమాజాన్ని నిర్మించినప్పుడు మాత్రమే నేరాల కట్టడి సాధ్యం. ఉరివేయాలి, మెడలు కోయాలి, బహిరంగంగా తగలబెట్టాలి.. ఇలాంటి శిక్షలు సైతం మనిషిని మార్చలేవు. సో, సమాజం మారాలంటే.. అటు ప్రభుత్వాలు కూడా జీడీపీ ఆధారంగా కాకుండా హ్యాపీనెస్‌ ఇండెక్స్ కొలమానంగా పాలించాలంటున్నారు విశ్లేషకులు. మరి.. అలాంటి రోజులు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు చూస్తామో..!

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *