అది ఓ ప్రభుత్వ పాఠశాల. ఆ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..? ఆ ఖర్చు గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ విద్యార్థి కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఒక లక్ష కాదు… రెండు లక్షలు కాదు.. ఏకంగా 12.84 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది.. ఎలా అంటారా. .ఆ పాఠశాల ఎక్కడ ఉంది అంటారా..?
ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్య కోసం ప్రైవేట్ స్కూల్స్‌లో తమ పిల్లల్ని చదివించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతొ రాను రాను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సంఖ్య తగ్గిపోతోంది. దీంతో విద్యార్థులు లేని చోట ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం.. తక్కువ విద్యర్థులు ఉన్న స్కూళ్లను… వేరే పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. కాగా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ స్టూడెంట్.. ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఆ గ్రామంలో 1 నుంచి 7 వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నప్పటికీ.. ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థిని మాత్రమే జాయిన్ అయ్యారు.
ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో ఉంది. ఈ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుకునే సౌలభ్యం ఉంది. అయితే ఈ పాఠశాలలో ఇదే గ్రామానికి చెందిన ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతుంది. ఈ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్‌ను నియమించింది. ఆ టీచర్‌కు నెలవారి ప్రభుత్వ జీతం రూ.1,01,167(అన్ని అలవెన్సులతో కలిపి) చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ఖర్చు 12 నెలలకు రూ.12.14 లక్షలు అవుతుంది. అదే విధంగా ఒక్క విద్యార్థిని కోసం వంట వండేందుకు ప్రభుత్వం వంట మనిషికి నెలకు మనిషికి నెలకు 3000 రూపాయలు చొప్పున చెల్లిస్తుంది. అంటే 10 నెలలు 30 వేల రూపాయలన్న మాట. ఇక పారిశుద్ధ్య కార్మికురాలికి నెలకు 3000 చొప్పున 10 నెలలకు 30 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం స్కూల్ మెయింటైన్ గ్రాంట్ కింద రూ.5000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో రూ. 5000 మంజూరు చేస్తుంది. అన్ని లెక్కలు కలిపి ఈ ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సుమారు 12.84 లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది. అయితే ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయురాలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది.
అయితే ఈ వ్యవహారంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక్క విద్యార్థిని విద్య కోసం రూ. 12.84 లక్షలు ఖర్చు చేయటం ఏమిటని కొందరు అంటున్నారు..ఆ విద్యార్థిని తల్లి తండ్రులు మాత్రం తమ కూతురును ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కృత నిశ్చయం ఉన్నారు. ప్రవేట్ స్కూల్‌లో చదివించే స్థోమత అందరికీ ఉండదని చెబుతున్నారు. దీంతో ఒక్క విద్యార్థి, ఒక్క టీచర్‌తోనే ప్రస్తుతం స్కూల్ రన్ అవుతోంది.