సారూ మాకు చదువు చెబుతారా! అంటూ భిక్షాటన చేసుకునే ఇద్దరు బాలురు కమిషనర్‌ను వేడుకున్న దృశ్యం అందర్నీ చలించేలా చేసింది. వెంటనే స్పందించిన కమిషనర్ ‘మీకు తెలిసిన పెద్దవారిని తీసుకొచ్చి, పాఠశాలలో చేరండి’ అంటూ తన ఫోన్ నంబరును వారికి ఇచ్చి పంపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ గురువారం వీఆర్ విద్యాసంస్థల ప్రాంగణాన్ని సందర్శించగా ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వద్దకు వచ్చిన బిక్షాటన చేసే అనాథ బాలురు పెంచలయ్య, వెంకటేశ్వర్లు “సార్ మాకూ చదువు చెబుతారా?” అంటూ చేతులు కట్టుకుని కమిషనర్‌ను అభ్యర్థించడం అక్కడున్న వారిని హృదయాలను కదలించింది.
లక్షల ఫీజులు కట్టి చదివిస్తున్నా కొంతమంది పిల్లలు చదవు పట్ల ఆసక్తి ప్రదర్శించరు. కానీ దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఈ చిన్నారులు తమకు విద్య నేర్చుకునే అవకాశం కల్పించమని కోరడంతో కమిషనర్ చలించిపోయారు. ‘‘మాలాంటి వాళ్లకీ ఇక్కడ చదువు చెబుతారనడంతో వచ్చాం సార్, మమ్మల్ని కూడా చేర్చుకోండి’’ అని చిన్నారులు అనగానే కమిషనర్‌తో పాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
వారి తపనను గమనించిన కమిషనర్ నందన్ స్పందిస్తూ.. “మీలాంటి వాళ్ల కోసమే ఈ పాఠశాలను ప్రారంభించారు. మీరు మీకు తెలిసిన పెద్దవారిని తీసుకొని రావాలి. వెంటనే మీకు అడ్మిషన్ ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. తన ఫోన్ నంబర్ రాసి చిన్నారుల చేతిలో పెట్టి పంపారు. చదువు కోసం చిన్నారులు ఇలా స్వయంగా అడగడమే కాక.. అధికారుల నుంచి అండ దొరకడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది.
Amaravati News Navyandhra First Digital News Portal