యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో మెయిన్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను డిసెంబర్ 9న సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదికి మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మెయిన్స్ నిర్వహించగా తాజాగా ఫలితాలు వెల్లడించారు. యూపీఎస్సీ పరీక్షలు మొత్తం మూడు దశల్లో జరుగుతాయి.
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తవగా త్వరలోనే ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో సత్తా చాటిన అభ్యర్థులను ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర (గ్రూప్ ఏ, గ్రూప్ బి) సర్వీసులకు ఎంపిక చేస్తారు. అయితే మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా DAF-II ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూరించాల్సి ఉంటుంది.13 డిసెంబర్ 13 నుంచి 19వ తేదీ సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే DAF-II అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షకి దేశ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 13.4 లక్షలు. వీరిలో 14,627 మంది మాత్రమే మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. ఇప్పుడు వీరిలో 2,800 మంది తుది దశ ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వెలువడుతుంది. ఇంటర్వ్యూ తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంటర్వ్యూకి ఎంపికైన 2,800లో ఏకంగా 90 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ప్రతిభ చూపి ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. గతేడాది ఏప్రిల్ 16న వెల్లడైన ‘సివిల్స్-2023’ తుది ఫలితాల్లో ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 60 మంది వివిధ సర్వీసులకు ఎంపికవడం గమనార్హం. వారిలో నలుగురు ఏకంగా 100లోపు ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య రెడ్డికి మూడో ర్యాంకు సాధించారు. ఎంతో కఠినమైన ఈ సివిల్ సర్వీస్ పరీక్షలకు తెలుగు వారు యేటా అధిక సంఖ్యలో ఎంపిక కావడం గర్వకారణం.