తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలాభిషేకం జరుగుతున్న వేళ… ఆకాశంలో ఏర్పడిన వలయాకార మేఘాలు స్థానికులను ఆశ్చర్యపర్చాయి. పాలాభిషేకం కోసం పాలు పొంగించే క్రమంలోనే ఆ దృశ్యం కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆకాశంలో ఏర్పడిన ఆ వలయం తేలికపాటి మేఘాలుగా ఉండటంతో… అక్కడున్న యువకులు మొబైల్ ఫోన్లలో దృశ్యాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆ దృశ్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది.
ప్రతి ఏడాది రైతులు పాండవుల మెట్ట వద్ద స్వామివారికి పాలు పొంగించి.. పాడిపంటలు నైవేద్యంగా సమర్పించే ఆచారాన్ని పాటిస్తుంటారు. తమ ఇంటి పశువుల నుంచి తీసిన పాలు, నెయ్యితో స్వయంగా నైవేద్యాలు తయారు చేసి సమర్పించడం ఆనవాయితీ. ఈ సమయంలో ఇటువంటి దృశ్యం కనిపించడం తమ గ్రామానికి శుభ సూచకమని గ్రామస్థులు భావిస్తున్నారు. కాలక్రమంలో పంటలు బాగా పండాలని, వర్షాలు పడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ రైతులు పాలాభిషేకం నిర్వహించారని తెలిపారు.