అయ్యా బాబోయ్.. ఈ కోడిపుంజు ధర రూ.2లక్షలు.. ఎక్కడో తెలుసా? 

వసంతంలో కోకిల గానం, పురి విప్పి నెమలి చేసే నాట్యం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు, అప్పుడూ అందరూ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తుంటారు.. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాల హడావుడి అంతా ఇంతా కాదు. మరి ఈ సారి కోడిపుంజులు ధర ఎంత ఉందో తెలుసా? అక్షరాలా రూ.2లక్షలు..

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే కోడి పందాలు.. పండుగ సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు హడావుడి మొదలైంది. ఇప్పటికే రకరకాల పుంజులతో కోడిపందాలకు సిద్ధమవుతున్నారు. కోడి పందాలు కోసం దేశవాళీ కోడిపుంజులతోపాటు విదేశీ కోడి పుంజులను సిద్ధం చేస్తున్నారు. మంచి బలవర్ధకమైన ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వాటికి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇక పండగ మూడు రోజులు కోడిపందాల జోరుతో తెలుగు రాష్ట్రాలు సందడిగా మారనున్నాయి. ఏలూరు జిల్లాలో తోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మకాంల వద్ద పందెం పుంజులను పెంచుతున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతాయి. ముఖ్యంగా జిల్లాలో ప్రతి ఏటా సుమారు 200 పైగా కోడిపందెం బరులు సిద్ధమవుతాయి. భీమవరం, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు గణపవరం మండలాల్లో పెద్ద ఎత్తున ఈ కోడిపందాలు నిర్వహిస్తారు.. అదేవిధంగా మేట్ట ప్రాంతమైన జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, దెందులూరు, ద్వారకాతిరుమల, లింగపాలెం, చింతలపూడి మండలాలతో పాటు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో సైతం కోడిపందాలు జోరుగా జరుగుతాయి. పందెం కోడి పుంజుల పెంపకం ఎంతో శ్రమతో కూడుకున్న పని.. ఎంతో ప్రత్యేక శ్రద్ధతో వాటిని పెంచాలి. ముందుగా పందెం పుంజుల పెంపకం కోసం విశాలమైన ఖాళీ ప్రదేశాలలో షెడ్లు నిర్మించి, వాటిలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ముందుగా శ్రేష్టమైన గుడ్ల నుంచి పొదిగిన పందెం పుంజుల పిల్లలను ఆరు నెలల వరకు గుంపులో పెంచుతారు. అనంతరం వాటి పోరాట పటిమ, రంగు, ఎత్తులను బట్టి వేరు చేస్తారు. అలా వేరు చేసిన వాటిని ప్రతిరోజు ప్రత్యేకమైన ఆహారంతో పాటు, వాటికి అంటూ వ్యాధులు రాకుండా ఉండేందుకు మందులు వాడతారు. అదేవిధంగా వాటి రోగ నిరోధ శక్తికి పిల్లల దశ నుంచే టీకాలు వేయిస్తారు. ఇక పండుగకు రెండు నెలల ముందు నుంచే వాటి పోరాట పట్టిన ఆధారంగా ప్రత్యేక పోషకాహారమైన బాదంపప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, ఉండలుగా చేసి వాటికి తినిపిస్తారు. అంతేకాకుండా ప్రత్యేకంగా మేక మాంసాన్ని కైమా ఉండలుగా చేసి వాటికి అందిస్తారు. దాని ద్వారా వాటి శరీరం దృఢంగా తయారై, పందెం బరిలో గాయాలైనప్పుడు త్వరగా ప్రత్యర్థి పుంజుకి లొంగిపోకుండా ఉండేలా తయారు చేస్తారు. ఇక వేడి నీటి ఆవిరితో ఉదయం సాయంత్రం కాకలు తీరుస్తారు. అదేవిధంగా ఉదయం నీటిలో ఈత కొట్టించి, అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రింగులో వాకింగ్ చేయించి వ్యాయామం చేయిస్తారు.

కోడి పుంజు ధర రూ.2లక్షలు

కోడి పుంజులను పండుగకు పది రోజుల ముందు పందెం రాయుళ్లు పెంపకం దారుల వద్దకు వెళ్లి వాటి పోరాటం, రంగు, ఎత్తు ఆధారంగా ధరలు నిర్ణయించి విక్రయిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసిన పందెం పుంజు ధర ప్రస్తుతం సుమారు ఒక లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు పలుకుతుంది. అయితే పందేలు కూడా అంతే స్థాయిలో జరుగుతుతాయి. ఒక్కొక్క కోడి పందాన్ని తలపడే కోడిపుంజులను బట్టి లక్ష రూపాయలు నుంచి 50 లక్షల వరకు పందేలు కడతారు. పందాలలో తడపడే పందెం కోళ్ళు ప్రత్యేక తయారీకి ఒక్కొక్క కోడికి సుమారు 25 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుంది. ఇక పుంజులలో ఎన్నో రకాలు ఉంటాయి. దేశవాళీ కోడిపుంజులను వాటి రంగుల్ని భట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా కాకి, నెమలి, డేగ, సెతువా, పచ్చ కాకి, రసింగి, మైలా, ఇలా రకరకాల పేర్లతో వాటిని పిలుస్తారు. నల్లటి ఈకలు కలిగి ఉన్న కోడిపుంజును కాకి అంటారు. అదేవిధంగా రెక్కలు, శరీరంపై తెల్ల ఈకల ఉండి క్రింద భాగంలో నీలవర్ణంలో ఈకలు ఉన్న కోడిపుంజును నెమలి అంటారు. అలాగే తేనె వర్ణంలో రంగు గల ఈకలు ఉన్న కోడిపుంజుని రసింగి అంటారు. అదేవిధంగా ఎర్రటి రంగులో ఈకలు కలిగి ఉన్న కోడిపుంజును డేగ అనీ పిలుస్తారు, ఇక ఎర్రటి ఈకలు, అక్కడక్కడ నలుపు ఈకలు ఉన్న కోడిపుంజును పచ్చ కాకి అని పిలుస్తారు, పూర్తిగా తెలుపు రంగులో ఈకలు ఉన్న కోడిపుంజును సేతువా అంటారు. అలాగే బూడిద వర్ణంలో ఈకలు కలిగి ఉన్న కోడిని మైలా అని పిలుస్తారు. అలాగే చూడడానికి కోడి పెట్టలాగా ఉండే కోడిపుంజును పెట్టమారు అంటారు. ఇవే కాక ఇంకా పలు రకాల పేర్లతో పందెం పుంజులను పిలుస్తారు. వాటి రంగుల బట్టి కూడా వాటి ధర ఆధారపడి ఉంటుంది.

కోడి పందాలకు శాస్త్రం ఉందా?

ముఖ్యంగా కోడిపందాలు గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయాలలో కుక్కుట శాస్త్రం చాలా ప్రధానమైనది. ఎందుకంటే మనుషులకి ఒక శాస్త్రం ఉన్నట్టు కోళ్లకు కూడా కుక్కుట శాస్త్రం అందుబాటులో ఉంది. చాలామంది పందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రాన్ని అనుసరించే పందాలు వేస్తారు, కాస్తారు. కుక్కుట శాస్త్రంలో కోడి పందాలపై ఎన్నో విషయాలు అందులో ఉంటాయి. కృష్ణపక్షం, శుక్లపక్షం రెండిటినీ కలిపి నేలగా పరిగణిస్తారు. చంద్రుడు పౌర్ణమి తరువాత నుండి రోజు రోజుకూ ప్రకాశం తగ్గుతూ అమావాస్య రోజున పూర్తిగా ప్రకాశం క్షీణిస్తాడు. ఈ సమయాన్ని కృష్ణ పక్షం అని అంటారు. అమావాస్య తరువాతిరోజు పాడ్యమి నుండి మొదలు పౌర్ణమి వరకు గల పదిహేను రోజులను శుక్లపక్షం అని పిలుస్తారు. వీటి ఆధారంగానే కుక్కుట శాస్త్రం పనిచేస్తుంది. పండుగ మూడు రోజులు శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో ఉందా చూసుకుంటారు. అదేవిధంగా ఈ జాములో ఏ రంగు పుంజు, ఏ రంగు కోడి పై పందెం వేస్తే గెలుస్తుందో కుక్కుట శాస్త్రంలో ఉంటుంది. అదేవిధంగా మనుషులతో పాటు కోడిపుంజులపై కూడా నక్షత్ర బలం పనిచేస్తుందనీ పందెం రాయుళ్లు నమ్మకం. కుక్కుట శాస్త్రం ప్రకారం ఒక్కో రంగు కొడిక్కి ఒక్కో నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్ర ప్రభావం భట్టి కూడా కోడిపందాలు వేస్తుంటారు.

అదేవిధంగా కుక్కుట శాస్త్రంలో దిక్కులను సైతం లెక్కలోకి తీసుకుంటారు. నక్షత్రం ఆధారంగా ఏ రంగు కోడిని ఏ దిక్కు వైపు నుంచి వదిలితే పందెం గెలుస్తుందో కుక్కుట శాస్త్రంలో వివరించబడి ఉంది. దానినీ ఆధారంగా చేసుకుని చాలామంది పందెం రాయుళ్లు కోడిపందాలు వేస్తుంటారు. ఈ పందాలు ఒక్క గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కాకుండా పట్టణంలో నివసించేవారు, సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఎక్కువగా పాల్గొనడంతో కోడిపందాలపై ఎంతో క్రేజ్ పెరిగిపోయింది. సంక్రాంతి మూడు రోజులు పట్టణాలు, నగరాలు  ఖాళీ అయి వారందరూ తమ సొంత గ్రామీణ ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు. పండగ మూడు రోజులు ఒక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 250 నుంచి 300 కోట్ల రూపాయలు చేతులు మారుతాయి అని అంచనా వేస్తున్నారు. ఓ పక్క పందాల బరిలో కోడిపందాలతో పాటు గుండాట పేకాట జోరుగా సాగుతాయి. అంతేకాకుండా కోడిపందాల వీక్షణ కోసం వచ్చే పందెం రాయుళ్ల కోసం ప్రత్యేకమైన వంటకాలు, రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పందెం బరుల వద్ద కోజా మాంసాన్ని ఎక్కువగా తింటారు. పందెంలో ఓడిపోయిన పుంజుని కోజా అంటారు. అలాంటి కోజా పుంజులతో ప్రత్యేక వంటకాలు చేస్తారు.

పందాల కోసం ఏర్పాటు చేసే బరులు క్రీడా ప్రాంగణాలను తలదన్నేలా ఉంటాయి. ముందుగా సిద్ధం చేసిన ఖాళీ ప్రదేశాలలో ప్రత్యేకమైన ఎర్ర మట్టితో చదును చేసి ఉదయం సాయంత్రం నీటితో తడిపి ట్రాక్టర్ సహాయంతో ప్రాంగణాన్ని దున్నుతారు. క్రికెట్ స్టేడియాలకు ఏమాత్రం తీసిపోనీ విధంగా పందెంబరిలో ఏ చోట అయితే కోడిపుంజులు పోరాడతాయో అక్కడ ప్రత్యేకంగా మట్టి మెత్తగా ఉండేవిధంగా ఏర్పాటుచేసి, ఇక పందెంబరి చుట్టూ నాలుగు వైపులా స్తంభాలు పాతి వాటిని ఐరన్ ఫెన్సింగులతో ఎవరు లోపలికి రాకుండా రక్షణగా కడతారు. అదేవిధంగా పందెం బరి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఏర్పాటు చేసి కేవలం కోడిపుంజులు, పెందేం వేసే వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. నాలుగు ద్వారాలను తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులలో వుండే విధంగా ఏర్పాటుచేస్తారు. అలాగే పందేలను వీక్షించే వారికోసం బరి చుట్టూరు సోఫాలు, కుర్చీలు ఏర్పాటు చేస్తారు. గతంలో ఈ పందెం బరులను తోటలలో ఏర్పాటు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు పెద్దపెద్ద షామియానాలు , టెంట్లతో ఏ విధంగా డెకరేషన్ చేస్తారో వాటిని తల దాన్నెలా పందెం రాయుళ్లు పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు.

About Kadam

Check Also

మాయదారి రోగం మళ్లీ దాపురించింది.. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం..!

ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ లక్షణాలు కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *