ఒక్కడే కొడుకు.. ఆస్తులు లేకున్నా.. రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకును బీటెక్ చదివించారు. అయితే అతను మాత్రం తప్పుడు మార్గంలో పయనించాడు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారలేదు. పైగా అమ్మనాన్నలనే చీదరించుకున్నాడు. పెళ్లి చేయాలని, మనవళ్లు, మనవరాళ్లతో వారి ఆశలు అడియాశలే అని భావించారు. దీంతో…
నంద్యాలలో ఆ దంపతులు పూలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒక్కడే కుమారుడు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. రూపాయి.. రూపాయి కూడబెట్టి.. తనయుడ్ని బీటెక్ చదివించారు. అయితే చదువు పెద్దగా రాకపోవడంతో.. ఆటో కొనివ్వమని తనయుడు కోరడంతో కొనిపెట్టారు. అయితే అతను చెడు తిరుగుళ్లు తిరుగుతున్న విషయాన్ని మాత్రం వారు గుర్తించలేకపోయారు. ఆటో డ్రైవర్‌గా అతని ప్రయాణం హిజ్రాలతో పరిచయం, సాన్నిహిత్యానికి దారితీసింది. ఆపై హిజ్రాలు ఇంటికి రావడం కూడా ప్రారంభించారు. దీంతో ఆ దంపతులకు తల కొట్టేసినట్లు అయింది. కొడుకును మందలించినా ఫలితం లేకపోయింది. పెళ్లి చేసుకుని తమకు ఆసరాగా నిలవమని వారు కోరినా.. అతని బుద్ది మారలేదు. దీంతో తల్లిదండ్రులకు తనయులకు మధ్య.. తరచూ గొడవలు జరిగేవి. కౌన్సిలింగ్ ఇప్పించినా అతనిలో నో ఛేంజ్. ఫైనల్‌గా నాకు వాళ్లే కావాలి.. మీరు అక్కర్లేదు అని తెగేసి చెప్పాడు తనయుడు. వారితోనే కలిసి ఉంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో వారు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇన్నాళ్లు తమను ఉద్దరిస్తాడని.. మంచి పేరు తెస్తాడని ఆశలు పెట్టుకున్న కోడు ఛీ పొమ్మనడంతో.. వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
తమ బాధను ఎవరితో పంచుకోలేక.. సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక మానసిక సంఘర్షణకు లోనై.. గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టంత కుమారుడు ఉన్నా మార్చురీ గదిలో అనాథ శవాల మాదిరిగా వారిని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డలు కనగలం కానీ వారి బుద్ధులు కనలేం కదా.. అని మాట్లాడుకుంటున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal