హీరోలు, రాజకీయ నాయకులకు ఉండే అభిమానులు ఎప్పటికప్పుడూ తన అభిమాన నాయకుడిపై తమకు ఉన్న ప్రేమను ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక వ్యక్తి పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చూపించారు. పవన్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభిమాని ఈశ్వర్ రాయల్ తిరుమలలోని జపాలి ఆలయానికి వెళ్లే మార్గంలోని 150 మెట్లు పొర్లు దండాలు పెట్టాడు.
జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును టెంపుల్ సిటీ తిరుపతిలో జనసేన వీరాభిమానులు వినూత్న రీతిలో జరుపుకున్నారు. పవన్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభిమాని ఈశ్వర్ రాయల్ విభిన్న ప్రయత్నం చేశాడు. తిరుమలలోని జపాలి ఆలయానికి వెళ్లే మార్గంలోని 150 మెట్లు పొర్లు దండాలు పెట్టాడు. జపాలి ఆంజనేయ స్వామి వారికి మొక్కులు చెల్లించాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జాపాలి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించి పొర్లు దండాలు పెడుతూ స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందనన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఇలాగే కూటమి ప్రభుత్వం మరో 30 ఏళ్ళ అధికారంలో ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నానన్నాడు పవన్ అభిమాని ఈశ్వర్.
అలిపిరి వద్ద టెంకాయలు కొట్టిన ఎమ్మెల్యే
మరోవైపు రియల్ హీరో పవన్ కళ్యాణ్ అంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆద్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో టెంపుల్ సిటీలో పండుగ వాతావరణం నెలకొంది. చెన్నారెడ్డి కాలనీలోని బిసి గర్ల్స్ హాస్టల్ లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాన్ పుట్టిన రోజు వేడుకలను చిన్నపిల్లలు, జనసేన శ్రేణుల మధ్య జరిపారు. విద్యార్థినీలకు బుక్స్, పెన్స్, దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలు శ్రీవారిని వేడుకున్నారు.
అలాగే ఈ సందర్భంగా మెటర్నటీ హాస్పిటల్ లో పండ్ల, బ్రెడ్, దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, రుయా ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. పేద, నాయి బ్రాహ్మణలకు సెలూన్ కిట్స్ ను అందించారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూల్ లో చదువుతూ పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థిణీలకు రెండు సైకిళ్ళను అందజేశారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవకు అంకితమైన గొప్ప నాయకుడన్నారు. కోట్లాది మంది అభిమానుల ఆదరణే పవన్ కళ్యాణ్ ఆస్తి అన్నారు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు. రీల్ హీరో గానే కాకుండా గత ఎన్నికల్లో వందశాతం స్ట్రయిక్ రేట్ సాధించి పవన్ కల్యాణ్ రియల్ హీరోగా మారారన్నారు.