ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఆయన పేరును జనసేన అధినేత పవన్ ఫైనల్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబు పేరును జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు దక్కే పదవిపై కొంతకాలంగా అనేక రకాలు ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా నాగబాబును మండలికి పంపాలని పవన్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీలోనే నాగబాబు అభ్యర్థిత్వంపై నిర్ణయం జరిగినట్టు సమాచారం. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు కావడంతో.. మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నాలుగు స్థానాలు టీడీపీకే దక్కుతాయా ? లేక బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ స్థానాల కోసం అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్యనాయకులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చింది. దీంతో వారిలో చాలామంది ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై కూడా బీజేపీ నాయకత్వంతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన తరహాలోనే బీజేపీకి కూడా ఒక స్థానం కేటాయిస్తారా ? లేక నాలుగు స్థానాలు టీడీపీకే దక్కుతాయా ? అన్న అంశంపై చంద్రబాబు ఢిల్లీ టూర్ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ఎవరనేది ప్రకటిస్తారని తెలుస్తోంది.