ఆరేళ్లుగా స్థానిక సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ప్రతిరోజూ దర్శనమిచ్చే ఈ నెమలి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం ఎనిమిదికి ఆలయానికి చేరి సాయంత్రం నాలుగున అడవికి వెళ్ళే ఈ నెమలిని.. భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తున్నారు. ఆ నెమలితో ప్రత్యేకంగా సెల్పీలు దిగుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారుగూడెం గ్రామ సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద కనిపించే ఓ నెమలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఆలయానికి చేరుకొని.. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అడవికి వెళ్లిపోతుంది. గత ఆరేళ్లుగా ఇదే తంతు కొనసాగిస్తోంది. ఈ నెమలి పట్ల భక్తులు, స్థానికులు చాలా ప్రత్యేకంగా చూస్తు్న్నారు. సాక్షాత్తూ అమ్మవారే నెమలి రూపంలో దర్శనమిస్తున్నట్లు భావిస్తున్నారు.
నెమలి ఉదయం ఆలయానికి చేరి.. రోజంతా ఆలయ ఆవరణలో గడుపుతుంది. సాయంత్రం సమయానికి అడవిలోకెళ్లిపోతుంది. గత ఆరేళ్లుగా ఈ విధంగానే నెమలి ఆచారం కొనసాగుతుండటంతో.. ఆలయ పూజారి చినబాబు దీనికి ‘మల్లు’ అని పేరు పెట్టారు. పూజారి చినబాబు మాట్లాడుతూ “ప్రతిరోజూ అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయానికి నెమలి వచ్చి.. సాయంత్రం వెళ్తుంది. ఇది ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తోంది. ఇలా రోజూ వస్తూ ఉండటంతో ఈ నెమలితో పూజారి కుటుంబానికి కూడా అనుబంధం ఏర్పడింది. మా ఇంటి మనిషిలా మల్లు రోజంతా మా ఇంటి ముందు గడుపుతుందని వారు చెబుతున్నారు.
భక్తులు నెమలిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి.. భక్తి భావం ప్రదర్శించడంతో పాటు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నెమలి ఆ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ మల్లు నెమలి విశేషాలు ఆలయాన్ని సందర్శించే భక్తులకే కాక.. ఆ మార్గంలో ప్రయాణించే వారికీ ఒక గుర్తుగా నిలుస్తున్నాయి.