రైతులకు మోడీ సర్కార్ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈనెల 24న పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాకు డబ్బులు బదిలీ చేయనున్నారు. ఇప్పటి వరకు 18వి విడత రాగా, ఇప్పుడు 19వ విడత అందుకోనున్నారు..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత కలిగిన రైతుల ఖాతాలో 19వ విడత ఫిబ్రవరి 24 సోమవారం విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోడీ 19వ విడత పీఎం-కిసాన్‌ను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సమయంలో దాదాపు రూ.22,000 కోట్లు 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతాయన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రతి లబ్ధిదారునికి ప్రతి 4 నెలలకు రూ.2,000 ఇస్తుంది. ఈ విధంగా సంవత్సరానికి మొత్తం రూ.6,000 మూడు సమాన వాయిదాలలో అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
18వ విడతలో లబ్ధిదారుల సంఖ్య 9.6 కోట్లుగా ఉందని, ఇప్పుడు అది పెరిగిందని చౌహాన్ అన్నారు. 18వ విడతను ప్రధానమంత్రి మోదీ 2024 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుండి విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం రూ.3.46 లక్షల కోట్లు ఇచ్చింది. వచ్చే వారం 19వ విడత విడుదల తర్వాత ఈ మొత్తం రూ.3.68 లక్షల కోట్లకు పెరుగుతుంది.
PM-Kisan పథకం డిసెంబర్ 1,2018లో ప్రటకన చేయగా, ఫిబ్రవరి 2019 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు ఖర్చులను తీర్చడంలో సహాయపడుతుంది. ఉత్పత్తిని పెంచడానికి, సాగు ఖర్చును తగ్గించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ఈ పథకంలో భాగంగా జాబితాలో మీ పేరు లేకుంటే, మీరు PM కిసాన్ సమ్మాన్ హెల్ప్‌లైన్ 011-24300606 కు కాల్ చేయడం ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. పథకం ప్రయోజనాలు సరైన రైతులకు చేరేలా ప్రభుత్వం e-KYC (ఎలక్ట్రానిక్ KYC)ని తప్పనిసరి చేసిందని గుర్తుంచుకోండి. మీ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడితే మీరు PM కిసాన్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా OTP ద్వారా e-KYC చేయవచ్చు. మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే మీరు సమీపంలోని CSC (కామన్ సర్వీస్ సెంటర్)కి వెళ్లి వేలిముద్ర ధృవీకరణ ద్వారా e-KYC పొందవచ్చు.