ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఎస్‌సీవో సదస్సుకు రావాలని చైనా మోదీని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారీఫ్‌లు పెంచిన నేపథ్యంలో మోదీ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2019లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ చివరి సారి చైనాలో పర్యటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత్ – చైనా తమ ఆర్థిక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు.
చైనా పర్యటనకు ముందు మోదీ జపాన్ లో పర్యటించనున్నారు. ఆగస్టు 30న జపాన్‌ను సందర్శించనున్నారు. అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుండి ఆయన చైనాకు వెళతారు. ప్రధాని టూర్‌కు ముందు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం మాస్కోలో సీనియర్ రష్యన్ అధికారులతో అజిత్ దోవల్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో భారత్-రష్యా రక్షణ, భద్రతా సహకారం, చమురు ఆంక్షలు, రాబోయే మోడీ-పుతిన్ శిఖరాగ్ర భేటీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని భారత చర్యలతో అర్థమవుతోంది..
కాగా 2019లో గాల్వాన్ లోయలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత కూడా పలు సార్లు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. అయితే గత కొంతకాలంగా సంబంధాలను బలపరుచుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలపై ట్రంప్ టారీఫ్‌లు విధించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మోదీ చైనాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో మోదీ కీలక చర్చలు జరపనున్నారు.