తెలుగు ప్రజలందరూ ఎప్పటినుంచో ఉత్కంఠగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలవనుంది. ఎందుకంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని మోదీ పర్యటన నిర్ధారణ కాగానే ముఖ్యమంత్రి కార్యాలయం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటనపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, ప్రధాని పర్యటన విజయవంతంగా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులను అధికారులను ఆదేశించారు. ప్రధాని సభను అమరావతి సచివాలయం వెనుక భాగంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడే భారీ స్థాయిలో వేదిక నిర్మాణం జరుగుతుంది. కనీసం లక్ష మంది ప్రజలు పాల్గొనే ఈ సభకు ప్రత్యేకంగా బస్సులు, పార్కింగ్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మోదీ వేదికపై నుంచే అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఇది కేవలం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు.. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాజధాని నిర్మాణం మరోసారి జోరు అందుకుంటోంది. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాలనే కాక, ప్రజల మనసుల్లో అభివృద్ధి పట్ల నూతన ఆశలు నింపనుంది. మే 2న మోదీ పర్యటనతో అమరావతి మహోగ్ర తేజంతో వెలిగిపోతుందన్న భావం అందరిలో నెలకొంది.
Amaravati News Navyandhra First Digital News Portal