75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి, దేశవిదేశాల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, ఢిల్లీ ప్రభుత్వ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించారు. అనేక చోట్ల మతపరమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కృషి, విశిష్ట నాయకత్వం ద్వారా దేశంలో పెద్ద లక్ష్యాలను సాధించే సంస్కృతిని మోదీ సృష్టించారని అన్నారు. ప్రధానమంత్రి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ‘‘మీ దార్శనిక నాయకత్వంలో, భారతదేశం ప్రపంచ వేదికపై ఒక ముద్ర వేస్తోంది. అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యం వైపు స్థిరంగా ముందుకు సాగుతోంది. మాతృభూమి సేవకు అంకితమైన మీకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, సంతృప్తికరమైన జీవితాన్ని కోరుకుంటున్నాను’’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

దేశం కోసం త్యాగం, తపస్సు, పూర్తి అంకితభావానికి నరేంద్ర మోదీ జీ అంటూ కేంద్రం హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా X వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన దార్శనిక నాయకత్వం, అవిశ్రాంత కృషితో భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేశారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సమాజంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రధానమంత్రి తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని, ఆయన జీవితం పూర్తిగా మచ్చలేనిదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు.

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజల కోసం నిరంతరం కృషిచేసే ప్రధాని.. దేశానికి దొరకడం అదృష్టం అన్నారు. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌తో దేశాన్ని మోదీ ముందుకు నడిపిస్తున్నారన్నారు. వికసిత్ భారత్‌ 2047 లక్ష్యం కోసం మోదీ అందిస్తున్న మార్గదర్శకత్వం అద్భుతమన్నారు. ప్రధాని మోదీ.. నిండునూరేళ్లూ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల పట్ల మీ ప్రేమ, సమర్థ నాయకత్వం, సామాజిక బాధ్యత.. ఎంతో ప్రేరణ ఇస్తుందన్నారు. దేశానికి మరిన్ని సేవలు అందించేందుకు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పవన్‌ కల్యాణ్ చెప్పారు.

ప్రధానమంత్రి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం గురుద్వారాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మోదీ జీ దీర్ఘాయుష్షు కోసం జగన్నాథుడిని ప్రార్థించారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కపిల్ మిశ్రా మార్గట్ హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించి హనుమాన్ చాలీసా చదివారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలను ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా సేవా పఖ్వాడా ప్రచారం కింద రక్తదానం చేశారు.ప్రధానమంత్రి పుట్టినరోజున సేవా పఖ్వాడాను జరుపుకుంటామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి డాక్టర్ పంకజ్ సింగ్ అన్నారు. ఇందులో భాగంగా 101 జన్ ఆరోగ్య మందిరాలు, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించనున్నారు. రాబోయే 15 రోజుల్లో 75 కొత్త ప్రాజెక్టులను ఢిల్లీ ప్రజలకు అంకితం చేస్తామని మంత్రి తెలిపారు.

వారణాసిలో ప్రధాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు గంగనదికి హారతి ఇచ్చారు.. ఆయన మరింత ఆయుష్షు, ఆరోగ్యంతో ఉండాలని పూజలు చేశారు. అటు పూరీకి చెందిన ఓ శాండ్‌ ఆర్టిస్ట్ ప్రధానికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా అద్భుత సైకత శిల్పం గీశాడు.. మోదీ శాండ్‌ ఆర్ట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పర్యటిస్తారు. ఇక్కడ దేశంలోని మొట్టమొదటి PM మిత్రా పార్క్‌కు శంకుస్థాపన చేసి, ‘సేవా పఖ్వాడా’ను ప్రారంభిస్తారు.

దేశవ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, ప్రముఖుల నుండి ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వస్తున్నాయి. ప్రముఖ ప్రపంచ అగ్రనేతలు తమ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా, భారతదేశంలోని రష్యన్ రాయబారి డెనిస్ అలిపోవ్ హిందీలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పోస్ట్ చేశారు. రష్యా రాయబారి తనదైన రీతిలో ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డెనిస్ అలిపోవ్ బుధవారం (సెప్టెంబర్ 17) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో “భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు !” అని పోస్ట్ చేశారు.

“దశాబ్దాల నాటి రష్యా-భారత్ స్నేహాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన అమూల్యమైన కృషికి కృతజ్ఞులం. భారతదేశం తోపాటు ప్రపంచం శ్రేయస్సు కోసం ఆయన చేసే అన్ని పనులలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాము” అని రాస్తూ రష్యా రాయబారి ప్రధాని మోదీని అభినందించారు.

భారతదేశం-అమెరికా ఉద్రిక్తతల మధ్య డొనాల్డ్ ట్రంప్ వైఖరి మెత్తబడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఫోన్ చేశారు. సుంకాలపై ఉద్రిక్తతల మధ్య ట్రంప్ మరియు ప్రధాని మోదీ మధ్య జరిగిన సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. “ధన్యవాదాలు, నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్. నా 75వ పుట్టినరోజు సందర్భంగా మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు” అని రాస్తూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ట్రంప్‌ను ట్యాగ్ చేశారు.

ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది. రాబోయే 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని సేవా పక్షంగా జరుపుకుంటుంది. బీజేపీ ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ పుట్టినరోజును ప్రజా సేవగా జరుపుకుంటుంది. అయితే ఈసారి ప్రత్యేక సన్నాహాలు చేసింది.

About Kadam

Check Also

చైనా, భారత్‌పై సుంకాలు విధించండి! జీ7 దేశాలకు అమెరికా పిలుపు..

జీ7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు పెంచడం, రష్యన్ చమురు కొనుగోలుదారులపై సుంకాలు విధించడం గురించి చర్చ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *