ఓ మహిళ స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లగా.. ఆమెకు ఆ బాత్రూం కిటికీ దగ్గర నుంచి ఏదో శబ్దం రావడాన్ని గుర్తించింది. వెంటనే అక్కడ ఏముందా అని చూడగా.. దెబ్బకు కనిపించింది చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అసలు ఏమైంది అనేది ఇప్పుడు తెలుసుకుందామా..
విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించి.. ఎందుకలా చేశావ్ అని అడిగిన ఆమె భర్తపై దాడి చేసిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పోలాకి గౌరీ శంకర్ అలియాస్ శంకర్ అనే వ్యక్తి జూలై నెల నాలుగవ తేదీన బాధితురాలు తన ఇంట్లో స్నానం చేస్తుండగా బాత్రూమ్ కిటికీ వద్ద నుంచి రహస్యంగా సెల్‌ఫోన్‌తో వీడియో తీసే ప్రయత్నం చేశాడు. శంకర్ వీడియో తీస్తుండగా గమనించిన మహిళ పెద్దపెద్దగా కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన విషయం బాధితురాలు తన భర్తకు తెలియజేసింది. వెంటనే బాధితురాలు భర్త శంకర్ వద్దకు వెళ్లి అతన్ని నిలదీశాడు. శంకర్ తీసిన వీడియో డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తూ అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో శంకర్ బాధితురాలి భర్తపై దాడి చేసి.. అతడి సెల్‌ఫోన్ సైతం లాక్కొని పరారయ్యాడు. వెంటనే బాధితురాలు విజయనగరం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శంకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టెక్నాలజీ సహాయంతో ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామని, ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే భయం లేకుండా, నిర్మొహమాటంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు.
బాత్రూమ్‌లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి తర్వాత బెదిరింపులు పాల్పడే అవకాశాలు ఉన్నాయని.. ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని.. అలా లేకపోతే వీడియోలను అడ్డుపెట్టుకుని మహిళల జీవితాలను నాశనం చేసే పరిస్థితులు ఉంటాయని సూచించారు పోలీసులు. మహిళలు స్నానం చేసే ముందు పరిసరాలను పలుమార్లు గమనించి స్నానం చేయాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహిళల గోప్యతను భంగపరిచే ఇటువంటి చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.