ప్రియురాలు దూరంగా ఉంటుందని భరించలేకపోయాడు. చివరికి కూరగాయలు కోసే కత్తితో గొంతి కోసి హతమార్చాడు ప్రియుడు.
పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం.. అంటే ఇతరులకు ఉపకారం చేస్తే తిరిగి నీకు ఉపకారం లభిస్తుంది. అలాగే ఇతరులకు అపకారం చేస్తే తిరిగి అదే అపకారం నీకు లభిస్తుందని అర్ధం..! దీన్నే కర్మ ఫలితం అంటారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆ మహిళ చేసిన పాపం ఆమెను వెంటాడింది.. కర్మ రూపంలో తిరిగి ఆమెకే ఆ పాపం అంటుకుంది. దీంతో ఏ పాపం ఎరుగని ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడి కోసం భర్తను ప్రియుడితో కలిసి ఓ వివాహిత హతమార్చింది. తిరిగి అదే ప్రియుడు చేతిలో కత్తి దాడికి గురై ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. డిసెంబర్ 6వ తేదీన గిద్దలూరు పట్టణంలోని రజక బజారులో నివాసముంటున్న సుభాషిణి అనే వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సుభాషిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం తరలిస్తున్న సమయంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
విచారణలో సంచలన విషయాలు..
సుభాషిని హత్య కేసు విచారణలో పోలీసులు సంచలన విషయాలు వెలికి తీశారు. సుభాషినిని హత్య చేసిందీ ఆమె ప్రియుడు శ్రీకర్‌గా పోలీసులు తేల్చారు. కంభం మండలం నర్సిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన సుభాషినికి దొనకొండ మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన అంబటి శ్రీకర్ కు చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో రాచర్లలోని అమ్మమ్మ ఇంటి వద్ద శ్రీకర్ పెరిగాడు. సుభాషిని, శ్రీకర్ రాచర్లలో ఒకే పాఠశాలలో 10వ తరగతి చదివారు. ఇద్దరికీ అప్పటి నుంచే పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సుభాషిని కొంత కాలానికి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు కలిగారు. శ్రీకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత సుభాషినికి మరో మారు కలిశాడు. ఆ పరిచయం ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది.
భర్త మందలించడంతో..
సుభాషిని అక్రమ సంబంధం విషయం భర్త బాలకృష్ణకు తెలియడంతో భార్యను తరచూ మద్యం తాగి వచ్చి వేధిస్తుండేవాడు. 2023 ఏప్రిల్ నెలలో సుభాషిని భర్తకు మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి ప్రియుడు శ్రీకర్ తో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. తర్వాత సుభాషిని తన భర్త మద్యానికి బానిసై మనస్పర్దాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించింది. సుభాషినితో కలిసి బంధువులు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సుభాషిని ప్రియుడు శ్రీకర్ తో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. కొంతకాలం ఇద్దరూ అక్కడ సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సుభాషిని మళ్లీ గిద్దలూరుకు వచ్చి ఓ బట్టల దుకాణంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
ఈ క్రమంలో పలుమార్లు సుభాషినిని కలుసుకునేందుకు శ్రీకర్ ప్రయత్నించాడు. అయితే ఆమె అందుకు తిరస్కరించింది. శ్రీకర్ ఇబ్బంది పెడుతూ ఉండడంతో పెద్దల మధ్య పంచాయతీ కూడా పెట్టింది. పెద్దలు శ్రీకర్‌ను ఇక నుంచి సుభాషిని జోలికి పోకూడదని పంచాయతీలో తీర్మానించారు. కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉన్న శ్రీకర్ సుభాషినిపై కట్టలు తెంచుకునే కోపం పెంచుకున్నాడు. అదే అదునుగా చూసి డిసెంబర్ 6వ తేదీన కూరగాయలు కోసే కత్తితో సుభాషినిపై శ్రీకర్ దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గం మధ్యలో సుభాషిని మృతి చెందింది. తర్వాత హైదరాబాద్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడు శ్రీకర్ ను పోలీసులు రాచర్లలో పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించినట్టు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు.