కృష్ణా జిల్లాలో ఓ పోలీస్ అధికారి మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. గన్నవరంలో ఓ మహిళ పట్ల CRPF సీఐ కిరణ్ అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తోపాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాత్రి షాప్ మూసివేసి మహిళ ఇంటికి వెళ్తోంది. మహిళను చూసి వికృతంగా హారన్, లైట్లు కొడుతూ వేధించారు. దీంతో మహిళ భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె భర్త వచ్చి కిరణ్‌ను ప్రశ్నిస్తే దాడికి దిగారు. బూతులు తిడుతూ ముగ్గురు కలిసి మహిళ భర్తను చితకబాదారు. దీంతో బంధువులకు సమాచారం ఇచ్చారు ఆ దంపతులు.
ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు.. ముగ్గురు యువకులను నిలదీస్తే మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ మరింత రెచ్చిపోయారు. తాను పోలీస్‌నంటూ ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ అందరినీ ఇష్టానుసారం దూషించాడు కిరణ్. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్‌స్టేషన్‌లో సీఐ కిరణ్ ఇష్టానుసారం ప్రవర్తించాడు. అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దర్జాగా వెళ్లి ఫోన్‌కి చార్జింగ్ పెట్టుకుంటూ సొంత ఇంట్లో ఉన్నట్టు బిహేవ్ చేశాడు. అయితే మహిళపై దాడికి పాల్పడిన సీఐ కిరణ్ భద్రాచలంలో CRPF సీఐగా పనిచేస్తున్నాడని చెబుతున్నారు పోలీసులు.