అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెవెన్యూ కార్యాలయంలో పనిచేసిన వీఆర్వో ఇంట్లో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. రెవెన్యూ ఆఫీస్‌లోని అధికారులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఈ నకిలీ పత్రాలు బయటపడ్డాయి.
రెవెన్యూ శాఖలో అడ్డగోలుకు అడ్డువాకు ఉండదు. క్రింది స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఏదో ఒక పంచాయతీలో ఇరుక్కుంటూనే ఉంటారు. ముఖ్యంగా భూ వివాదాలకు రెవెన్యూ శాఖ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఇలా ఓ క్రింది స్థాయి ఉద్యోగి విచ్చలవిడిగా భూములను తన ఇష్టం వచ్చిన వారికి కట్టబెట్టి దొంగ పత్రాలను సృష్టించాడు. కానీ ఈ విషయం ఆ ఉద్యోగి చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది.పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు.
ఇక కలెక్టర్ ఆదేశాలతో గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న రాయచోటి మండలం సిబ్యాలకు చెందిన మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. నాగరాజు వీఆర్వోగా పనిచేసిన సమయంలో భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, అడంగల్, డీకేటీ పట్టాలు తయారు చేసినట్లు గుర్తించారు. అయితే నాగరాజు మరణించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు కూడా పంథా కొనసాగిస్తున్నట్లు తేలడంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు అధికారులు.
నాగరాజు ఇంట్లో సోదాలు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున నకిలీ రికార్డులు, డీకేటీ పట్టాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రాయచోటి పట్టణంలోని మరో రెవెన్యూ సిబ్బందితో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. వారి ఇంట్లోనూ అధికారులు నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆరా తీస్తున్నారు. భూముల ఆక్రమణదారుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని రెవెన్యూ సిబ్బంది ఇలాంటి నకిలీ పట్టాలు సృష్టించినట్లు గుర్తించారు. దీనిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా స్థానికుల నుంచి విపరీతమైన ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ రెవెన్యూ సిబ్బందితో ఈ తనిఖీలు చేయించినట్లు సమాచారం.