అడకత్తెరలో గేమ్ ఛేంజర్లు.. శుద్దపూసలెవరు..? కనిపించని నాలుగో సింహాలెవరు?

బహిరంగ హెచ్చరికలు.. దాంతోపాటే ఓదార్పులు. నిజానికి.. అధికారులు, రాజకీయ నేతల మధ్య కోల్డ్‌ వార్‌ ఇప్పుడు మొదలైంది కాదు. నాలుగంకెల జీతంరాళ్లకు పనిచేసే హోమ్‌గార్డ్‌, క్లర్క్‌ నుంచి రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చూపులువేలితో శాసించగల చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా.. అందరిదీ ఒకటే కథ. అంతులేని పని ఒత్తిడి.

గివ్ రెస్పెక్ట్.. టేక్ రెస్పెక్ట్..! గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటే వచ్చేవి కావు. ఆజమాయిషీ చేస్తే దొరికేవి కావు. ఇచ్చిపుచ్చుకుంటే వచ్చేవి. పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్.. వీళ్ల ప్రొఫెషనల్ రిలేషన్ కూడా అచ్చంగా అట్టాంటిదే. ఇద్దరూ పబ్లిక్ సర్వెంట్లే కనుక వీళ్ల సంబంధం మ్యూచ్యువల్ అండర్‌స్టాండింగ్‌ మీదే డిపెండై ఉంటుంది. రైలు పట్టాల్లా బ్యాలెన్స్‌డ్‌గా ముందుకెళితేనే గవర్నమెంట్లు సజావుగా నడిచేది. కానీ.. అదిప్పుడు జరుగుతోందా? లెజిస్లేటివ్ సిస్టమ్‌కీ కార్యనిర్వాహక వ్యవస్థకూ మధ్య ఏర్పడ్డ ఈ గ్యాప్‌ అంతకంతకూ పెరుగుతోందా..? అన్న చర్చ మొదలైంది.

ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా సగటు పొలిటీషియన్ పదవికుండే ఆయుష్షు మహా అయితే ఐదేళ్లు. ఆ తర్వాత ప్రజామోదం దొరికి అదృష్టాలు వరిస్తేనే వాళ్లకు ఎక్స్‌టెన్షన్లు. లేదంటే అట్నుంచటు రిటైర్మెంట్లే దిక్కు. కానీ.. సరాసరి బ్యూరోక్రాట్ మాత్రం సర్వీస్‌లో ఉన్నంత వరకూ జనంతోనే ఉంటాడు. జనంలోనే ఉంటాడు. ఆ తేడా ఎప్పటికి తెలియాలి.. ఎవ్వరికి తెలియాలి..?

మనం చెప్పినా చెప్పకపోయినా.. ఆ మూడు సింహాలకు మాత్రమే సెల్యూట్ కొట్టాలని వాళ్లకూ ఉంటుంది. తొలిసారి ఖాకీ టోపీ పెట్టుకున్నప్పుడు వాళ్లు చేసిన ప్రమాణం కూడా అదే. కష్టపడి చదివి.. సివిల్స్‌లో ర్యాంకు కొట్టి.. మస్సూరి లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రెండేళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకుని.. నడత, నడవడిక, పాలనా విషయాల్లో భేష్ అనిపించుకుని, దేశంలోని క్లిష్ట పరిస్థితుల్ని అవగతం చేసుకుని.. సబ్‌కలెక్టర్‌గా చార్జ్ తీసుకుని చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ దాకా జరిగే సగటు బ్యూరోక్రాట్ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు. కెరీర్ పరంగా దక్కే ప్రమోషన్లకు తోడు.. రోజువారీ విధినిర్వహణలో అంతకుమించి పరాభవాలు. పనిష్మెంట్లు, ట్రాన్స్‌ఫర్లు, డిమోషన్లు. ఇవన్నీ భరించలేక వీఆర్‌ఎస్ తీసుకుని ఓ నమస్కారం పెట్టి పారిపోయిన కేసులూ అనేకం..!

మొన్న ఒక చీఫ్‌ సెక్రటరీని చీఫ్‌ మినిస్టరే అవమానపర్చిన ఘటన.. నిన్న అడక్క ముందే సలహాలిచ్చినందుకు ఐఏఎస్‌ని కోపగించుకున్న మరో ముఖ్యమంత్రి. తన భార్యకు ఎస్కార్ట్ ఇవ్వలేదని నిలబెట్టి ప్రశ్నించిన ఒక అమాత్యుల వారు. లేటెస్ట్‌గా.. అధికార పార్టీకి తొత్తులుగా మారితే ఖబడ్దార్ అంటూ చూపుడువేలుతో హెచ్చరించిన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఇవన్నీ కలిపి పాలనా వ్యవస్థలో బ్యూరోక్రాట్ల పాత్ర ఏంటి అనే చర్చను మళ్లీ మళ్లీ లేవనెత్తేశాయి. ప్రజాతీర్పు తిరగబడి.. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఉన్నతాధికారులకు సినిమా 2.0 కనిపించి తీరాల్సిందే. రెడ్‌బుక్ రాసిపెట్టా.. ఒక్కొక్కరి పేరూ బైటికి తీస్తా.. పవర్లోకి వచ్చిన తర్వాత తేల్చుకుంటా అని ఒకరంటే.. అదొక అంటువ్యాధిలా మారి బ్లూబుక్కు, బ్లాక్‌బుక్కులు దాటి.. ఇప్పుడు కాషాయం బుక్కు దాకా వచ్చేసింది వ్యవహారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే సీన్లు. అడకత్తెరలో పోకచెక్కల్లా మారింది బ్యూరోక్రాట్ల పరిస్థితి. ఎస్‌బాస్ అంటూ జీ.. హుజూర్ కల్చర్‌కి కట్టుబడితే ఓకే. విధినిర్వహణ విషయంలో ప్రభుత్వాధినేతల్ని ప్రసన్నం చేసుకోవడం ఎప్పటికప్పుడు సవాలే వీళ్లకు. ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో తరహా శైలి. వాళ్ల వర్కింగ్ స్టయిల్‌కి తగ్గట్టు సింకవుతూ ఎగ్జిక్యూషన్ చెయ్యకపోతే మాటలు పడాల్సిందే. ఆ క్రమంలో తలదించుకోవాల్సి వచ్చినా రావొచ్చు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకమీదట ఒక లెక్క అంటూ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు క్లాసు పీకినప్పటి సీన్లు.. అప్పట్లో ఒక సెన్సేషన్. తెలంగాణలో అధికారుల అలసత్వంపై కూడా ప్రభుత్వాధినేతల్లో అసహనం కనిపించింది. క్షేత్రస్థాయికి వెళ్లడంలేదని, ఆఫీసుల్లోనే కూర్చుని ఏసీలకు అలవాటు పడ్డారని ముఖ్యమంత్రి వేసిన సెటైర్లు.. కలెక్టర్లను సూటిగానే తాకేశాయి. ఇష్టం లేకుంటే చెప్పండి వేరే చోటకు పోస్టింగ్‌ వేస్తా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని వార్నింగులూ వచ్చాయి.

పాపులారిటీ పెంచుకోవడం కోసం పొలిటికల్ లీడర్లు సృష్టించే కొన్ని సీన్లలో అయితే చివరకు బద్‌నామ్ అయ్యేది పోలీసాఫీసర్లే. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన ఐఏఎస్‌లకు దొరికిన ట్రీట్‌మెంట్ ఏంటో ప్రపంచమంతా చూసింది. అధికారులపై సానుభూతి పెల్లుబికింది. బీఆర్‌ఎస్ ఫైర్‌బ్రాండ్ కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ సమయంలో ఖాకీలు వ్యవహరించిన తీరు కూడా అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, హెచ్చరికలు, హుకుంలతో దద్దరిల్లింది తెలంగాణ.

విధినిర్వహణకు అడ్డు తగిలితే కఠినచర్యలు తీసుకునేలా చట్టంలో ఉండే ఆ ఒక్క రిలీఫ్ తప్పితే.. మిగతావన్నీ అధికారులకు సినిమా కష్టాలే. కానీ.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నిఖార్సుగా, నిక్కచ్చిగా డ్యూటీలు చేసుకున్న అధికారులు కొందరైతే.. చండశాసనులుగా.. అవినీతిపరులుగా ముద్రవేసుకుని దానికి తగ్గ పరిహారం అనుభవిస్తున్న అధికారుల జాబితా ఇంకోటుంది. ఆమాటకొస్తే.. వీళ్లలో చాలామంది అధికారులు పొలిటీషియన్ల కంటే దేశముదుర్లు.

ఏటా పదిలక్షల మంది UPSC ఎగ్జామ్ రాస్తే.. వాళ్లలో 0.2 శాతం మందికి మాత్రమే పిలుపొస్తుంది. అంటే.. ప్రతీ 2 వేల మందిలో ఒక్కరికంటే ఒక్కరికే సివిల్ సర్వెంట్లు కావాలన్న తమ కల నెరవేరేది. దేశమంతా వడకట్టి ఏటా 800 మందిని మాత్రమే ఎంపిక చేసి అఖిలభారత సర్వీసులకు పంపుతారు. కానీ.. ఇంత శ్రమకోర్చి జీవితాల్ని ధారబోసి చార్జ్ తీసుకున్న కొందరి క్లయిమాక్స్ మాత్రం జైలు ఊచల వెనుక ముగుస్తోంది. ఇదొక అంతులేని విషాదం.

బహిరంగ హెచ్చరికలు.. దాంతోపాటే ఓదార్పులు. నిజానికి.. అధికారులు, రాజకీయ నేతల మధ్య కోల్డ్‌ వార్‌ ఇప్పుడు మొదలైంది కాదు. నాలుగంకెల జీతంరాళ్లకు పనిచేసే హోమ్‌గార్డ్‌, క్లర్క్‌ నుంచి రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చూపుడు వేలితో శాసించగల చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా.. అందరిదీ ఒకటే కథ. అంతులేని పని ఒత్తిడి.. రాజకీయ ప్రమేయం. ప్రభుత్వాలు మారినా ఈ తీరు మాత్రం మారదు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల విషయంలో అందరి ధోరణీ ఒకేలా ఉంటోంది. గతంలో ఎల్‌వి సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేశ్, పీవీ రమేష్, అజయ్‌ కల్లం, మాదిరెడ్డి ప్రతాప్, జాస్తి కిషోర్, ఏబీ వెంకటేశ్వరరావు.. ఇలా ప్రభుత్వాల బారిన పడ్డ బ్యూరోక్రాట్ల లెక్క చాలానే ఉంది. జగన్ కొలువులో ఇష్టపడి తెచ్చుకున్నవాళ్లను కూడా ఇక్కట్లు తప్పలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ మాటకొస్తే… వీళ్లందరినీ బాధితుల కిందే జమ కట్టలేం. బాధ్యత మరిచి బాసుల దగ్గర గులాంగిరీ చేసినందుకు, స్వార్థపూరితంగా వ్యవహరించినందుకు శిక్ష అనుభవించిన, అనుభవిస్తున్నవాళ్ల జాబితా కూడా ఒకటుంది.

ఒక పారిశ్రామికవేత్తను ఫిదా చెయ్యబోయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలు.. కాంతిరాణా టాటా, విశాల్‌గున్నీ లాంటి ఐపీఎస్ అధికారుల్ని జైలుపాలు చేశాయి. ఇదే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇదొక నేషనల్ రికార్డు. జగన్ ఆస్తుల కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులొచ్చాయి. శ్రీలక్ష్మి లాంటి నిఖార్సయిన ఆఫీసర్‌కు జైలు కష్టాలూ తప్పలేదు. ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గి తెరవెనుక బాగోతాలకు పాల్పడ్డట్టు వీళ్ల మీద అభియోగాలున్నాయి. సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్ ఏమయ్యాడో ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. ప్రభుత్వాధినేత ఆదేశాల మేరకు అర్ధరాత్రి అరెస్టులు, థర్డ్‌ డిగ్రీలకు పాల్పడినట్టు ఆయనపై ఉన్న ఎలిగేషన్లన్నీ తీవ్రమైనవే. ఇందులో ఏకంగా స్టేట్ ఇంటిలిజెన్స్ విభాగమే ఇన్‌వాల్వ్ ఐనట్టు ఆధారాలున్నాయి. ఈ సీక్వెన్స్‌లో ఏబీ వెంకటేశ్వరర్రావుది ఖతర్నాక్ స్టోరీ. ప్రభుత్వ వేధింపులకు గురై.. సస్పెన్షన్‌ బారిన పడి.. రిటైరయ్యేదాకా పోస్టింగ్ కోసం న్యాయపోరాటం చేసిన ఏబీవీ.. ఐదేళ్లపాటు న్యూస్ మేకర్‌గా ఉన్నారు.

బ్యూరోక్రాట్లలో ఇంకో బాధాకరమైన ట్విస్ట్ ఏంటంటే.. కులాల కుంపట్లు. సామాజికవర్గాల వారీగా విడిపోయి.. ఆయా కులాలకు మాత్రమే ప్రయారిటీలిస్తూ పనిచేసే అధికారులు.. పోస్టింగులిచ్చేటప్పుడు కూడా కులాల ప్రాతిపదిన ఎంపిక చేసే ప్రభుత్వాలు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పార్టీల వారీగా అధికారుల్లో చీలిక వచ్చిందా అనేవి కొత్త డౌట్లు. దాని ఫలితమే ఈ మాస్ వార్నింగులు. కెరీర్‌ కోసం, హోదా పెరగడం కోసం వృత్తిపరమైన ఔన్నత్యాన్ని మరిచిపోయే అధికారులు కొందరు. సర్వీసులో ఉన్నప్పుడు వీళ్లకు కీలక పదవులు కావాలి.. రిటైరయ్యాక్కూడా మంచి కుర్చీలు దొరకాలి.. అందుకోసం అధికార పార్టీకి తొత్తులుగా మారి.. అడుగులకు మడుగులొత్తుతూ.. నేలబారు చర్యలకు దిగి వివాదాస్పదం అవుతున్నారు.

అలాగని.. ఐఏఎస్‌, ఐపీఎస్‌లందరూ అవినీతిపరులు అనే మాటలో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువ. కొంతమంది పోకడలతో నిజాయితీపరులైన అధికారులపై కూడా మచ్చ పడుతోంది. విపరీతమైన మానసికవత్తిడి, ఏదో ఒక డిపార్ట్‌మెంట్లోనో, సచివాలయం గదుల్లో బందీలైపోయి.. పొలిటీషియన్లు తరచూ పెట్టే ఫైళ్ల చికాకుల్లోనే వీళ్ల బతుకులన్నీ తెల్లారిపోతాయి. మొదట్లో దేశ ప్రజలకు ఏదైనా చేద్దామనే పట్టుదల ఉన్నా తర్వాత పరిస్థితులతో రాజీపడి.. ఎక్కడ సంతకాలు పెట్టాలో పెట్టేసి సర్దుకుపోయే అయ్యా..ఎస్‌లు కొందరు.

మంచిపనులతో ఆదర్శమూర్తులుగా నిలిచిన బ్యూరోక్రాట్లు కూడా లేకపోరు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించి, భార్యలకు సర్కారీ దవాఖానాల్లో కాన్పులు చేయించే ఐడియల్ ఐఏఎస్‌లూ మన దగ్గర బోలెడంతమంది. కానీ.. వాళ్లంతా లైమ్‌లైట్‌లోకి రారు.. పాపులారిటీ లిస్టులో ఉండరు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఏరికోరి కేరళనుంచి అరువు తెచ్చుకున్న క్రిష్ణతేజ ఇక్కడొక లైవ్ ఎగ్జాంపుల్. తాము చదివిన ప్రమాణ పత్రాన్ని మర్చిపోకుండా.. నైతిక విలువల్ని పాటిస్తూ.. డ్యూటీని చక్కబెట్టడం అనేది.. ఇప్పుడున్న పొలిటికల్ సిట్యువేషన్లో అందరికీ సాధ్యం కాకపోవచ్చు.

అల్టిమేట్‌గా బ్యూరోక్రాట్ల పట్ల పార్టీల తీరు మాత్రం అత్యంత జుగుప్సాకరం. అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారుల వ్యక్తిత్వాల మీద డైలాగులేసిన పార్టీలే.. అపోజిషన్‌లోకి రాగానే అదే ఆఫీసర్ల మీద నైతిక దాడికి దిగుతున్నాయి. అప్పుడు టీడీపీ అయినా.. ఇప్పుడు వైసీపీ అయినా.. ఈ విషయంలో సేమ్‌టుసేమ్. ఆవిధంగా బ్యూరోక్రసీ అడకత్తెరలో నలిపోతోంది. దీని పర్యవసానం ఏంటంటే.. జనాల్లో అధికారుల పట్ల గౌరవభావం తగ్గి.. చులకనభావం పెరగడం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం.

About Kadam

Check Also

దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట

ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *