పోస్టాఫీసులో డబ్బును విత్‌డ్రా చేసేందుకు వెళ్లాడు.. తీరా పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా

పోస్టాఫీసుల్లో డబ్బులు దాచుకున్న ఖాతాదారుల సొమ్మును పక్కదారి పట్టిస్తున్న పోస్ట్‌మాస్టర్ల ఉదంతాలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగండ్ల, చెరుకూరు, నాగులపాలెం పోస్టాఫీస్‌ బ్రాంచ్‌లలో ఇటీవల ఇలాంటి మోసాలే వెలుగు చూసాయి. తాజాగా బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీస్‌లో పోస్టుమాస్టర్ నకిలీ పాసు పుస్తకాలతో ఖాతాదారులను మోసం చేసిన విషయం వెలుగు చూసింది.

కష్టపడి సంపాదించుకుని పొదుపు చేసుకున్న సొమ్ము ఎవరో అప్పనంగా కొట్టేశారంటే ఎలా ఉంటుంది. చాలీచాలని సంపాదనలో కూడా రూపాయి రూపాయి కూడబెట్టి భవిష్యత్‌ అవసరాలకు దాచుకున్న డబ్బులు ప్రభుత్వ ఉద్యోగులే దిగమింగారంటే ఎలా అర్ధం చేసుకోవాలి. ప్రతి నెలా వచ్చే సామాజిక పింఛన్లో కొంత మిగుల్చుకొని వైద్య ఖర్చుల కోసం కొందరు, తమ పిల్లల భవిష్యత్ కోసం మరి కొందరు నెలనెలా పోస్టాఫీసులో పొదుపు చేస్తూ వచ్చిన సొమ్ము ఖాతాల్లో లేవంటే గుండెలు జారిపోవూ.. బాపట్ల జిల్లాలో ఓ పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకున్న వారి పరిస్థితి ఇలాగే ఉంది. కావలి కాయాల్సిన వారే కాజేస్తే ఎవరికి చెప్పుకోవాలని బాధితులు లబోదిబోమంటున్నారు. పొదుపర్లకు చేయూత అందించాల్సిన పోస్టుమాస్టర్ ఖాతాదారులను నమ్మించి నట్టేట ముంచడంతో మదుపర్లు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

బాపట్ల జిల్లా యద్దనపూడి మండలంపూనూరు పోస్టాఫీసులో పోస్టుమాస్టర్‌గా కల్యాణ్ రావు 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. పోస్టాఫీసుకు వచ్చేవారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. తన బ్రాంచ్‌లో 1200కు పైగా ఖాతాదారులు.. పోస్టుమాస్టర్ కల్యాణారావుపై నమ్మకంతో నెలనెలా పొదుపు సొమ్ము కడుతూ వస్తున్నారు. కొంతమంది ఖాతాదారులు గడువు ముగిసినా.. నగదు ఇవ్వకపోవడంతో చీరాల పోస్టల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుకి ఏప్రిల్ నెల 15న ఫిర్యాదు చేశారు. 19వ తేదీన తనిఖీకి వచ్చిన శ్రీనివాసరావు విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.

అయితే శ్రీనివాసరావు తప్పుడు నివేదిక అందించారంటూ కొందరు మోసపోయిన ఖాతాదారులు ఈ విషయాన్ని విజయవాడలోని పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో పోస్టాఫీస్ విజిలెన్స్ అధికారులు తిరిగి మే 22వ తేదీన పూనూరు పోస్టాఫీస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో పోస్టుమాస్టర్ అవినీతి బండారం బట్టబయలైంది. తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల పోస్టల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావును హిందుపురం బదిలీ చేసారు. దొంగ సంతకాలతో నగదు డ్రా చేసిన పూనూరు పోస్టుమాస్టర్‌ను సస్పెండ్ చేశారు.

పూనూరు పోస్టాఫీస్‌ బ్రాంచ్‌ కార్యాలయ పరిధిలో 50 లక్షలకు పైగా ఖాతాదారులను మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పర్చూరు ప్రాంతంలోని మరికొన్ని పోస్టాఫీస్‌లలో కోట్లలో ఖాతాదారుల సొమ్ము పోస్టుమాస్టర్లు వాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక బృందం చేత విచారణ జరిపించి.. పక్కదారి పట్టిన సొమ్ము రికవరీ చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. విచారణ నీరు కార్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తపాలా కార్యాలయాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పూనూరులో మాయమైన 50 లక్షల రూపాయలను రికవరీ చేసి బాధితులకు అందించాలని ఖాతాదారులు.. తపాలాశాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *