ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగడమే కాకుండా వినియోగదారులకు వివిధ రకాల బ్రాండ్లతో పాటు అధిక సేవలందించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకుంది. లైసెన్సులు ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయబడతాయి.. ఈ స్టోర్ల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము 15 లక్షల రూపాయిల కాగా.. లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయిలుగా నిర్ణయించారు. ప్రతి ఏటా లైసెన్సు రుసుము 10శాతం చొప్పున పెరుగుతుంది. ప్రీమియం షాపుల లైసెన్సుదారులకు ఇష్యూ ప్రైస్‌పై 20 శాతం మార్జిన్ చెల్లిస్తారు. ఈ ప్రీమియం స్టోర్లు కనీసం 4వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన భవనంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. దరఖాస్తులపై ఆ నోటిఫికేషన్‌లో పూర్తిగా క్లారిటీ ఇస్తారు.
