మూడోసారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి విశాఖకు రాబోతున్నారు. మోదీ పర్యటనతో ఏపీవాసుల పదేళ్ల కల నెరవేరబోతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపు ఖరారైంది. జనవరి ఎనిమిదిన ప్రధాని మోదీ అనకాపల్లి వస్తారని పార్లమెంటు సభ్యులు సీఎం రమేశ్ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్.. సహా మరి కొన్ని అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.
హాలో ఆంధ్రా.. అనకాపల్లిలో మరోసారి ప్రధాని ఆవాజ్ వినిపించనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 8న అనకాపల్లిలో పర్యటించారు ప్రధాని మోదీ. ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్ధికి కీలక హామీలను ఇచ్చారు కూడా. ఇటీవల నవంబర్ నెల 29వ తేదీన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతవారణం వల్ల పర్యటన రద్దయింది. అయితే, జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి వస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.
సోమవారం(డిసెంబర్ 23) రోజున కసింకోటలో 4.53 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు స్పీకర్ అయ్యన్నపాత్రులతో కలిసి ఎంపీ సీఎం రమేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనకాపల్లి జిల్లా పర్యటనపై ప్రకటన చేశారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ సహా మరికొన్ని అభివృద్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారన్నారు ఎంపీ సీఎం రమేష్. అనకాపల్లి జిల్లాలో అల్యూమినియం కొత్త ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు.
పుడిమడకలో ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు ఇటీవల సిద్ధం చేశారు. కీలకమైన ఈ ప్రాజెక్టులు నిర్మాణం ద్వారా అనకాపల్లి యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లాలో మూడు కేంద్రీయ విద్యాలయాలయాలు రాబతున్నాయన్నారు. అల్యూమినియం కొత్త ప్లాంట్ ఏర్పాటుకు భూసేకరణ పై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు ఎంపీ సీఎం రమేష్. జనవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు.