యానాం గోదావరిలో మత్యకారుల వలకు తొలి పులస చేప చిక్కింది. యానాం పుష్కర్ ఘాట్ వద్ద కేజీపైన ఉన్న పులస చేపను వేలంలో 15 వేల రూపాయలకు మత్స్యకార మహిళ పోన్నమండ రత్నం దక్కించుకుంది. స్థానిక మార్కెట్‌లో ఈ పులసను 18 వేల రూపాయలకు మత్యకార మహిళ రత్నం విక్రయించింది. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతాయి. గోదావరికి ఔషధ గుణాలున్న ఎర్ర నీరు వచ్చినప్పుడు.. ఎదురీదుతూ వెళ్లడం వల్ల పులస చేప అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతున్నారు మత్యకారులు.
గోదావరిలోకి ఎర్రనీరు రావడంతో అరుదైన పులస చేప పడటంతో మిగిలిన ఆగష్టు, సెప్టెంబర్ వరకు పులసలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మత్యకారులు. అరుదుగా లభించే పులస చేపను ఎంత ధరైనా పెట్టి కొనడానికి వెనుకాడరు మాంస ప్రియులు. అయితే చాలామంది గోదావరి పులస ఎప్పుడు దొరుకుతుందా.. వండి అత్యంత ఆప్తులకు, తెలిసిన బంధువులకు పంపిస్తూ ఉంటారు. గత సంవత్సరం పులస జాడే కనిపించకపోవడంతో నిరాశలో ఉన్నారు. కానీ ఈసారి పులసలు అత్యధికంగా దొరుకుతాయని సంబరపడుతున్నారు గోదావరి జిల్లా ప్రజలు.