గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేత పొగడ్తల వర్సం కురిపించారు. గవర్నర్ పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు వైసీపీ నెల్లిమర్ల ఇన్‌చార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు. గజపతిరాజు ఈ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన మహానుభావులు అంటూ కొనియాడారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టే ఉన్నతమైన పదవులు దక్కాయని చెప్పారు వైసీపీ నేత అప్పలనాయుడు. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ కావడం సంతోషంగా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నారని అన్నారు. పదవి ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు అప్పలనాయుడు.
కాగా, గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారు. అశోక్ గజపతి రాజు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఇలా వివిధ హోదాల్లో ఆయన సేవలు అందించారు.. భారతదేశ సంస్థానాల్లోకెల్లా అత్యంత గౌరవం పొందిన గజపతిరాజుల వారసుడిగా.. రాజకీయంగాల్లోకి వచ్చిన అశోక్ గజపతిరాజు.. జనతా పార్టీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1978లో తొలిసారి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన… ఆ తర్వాత 1983 నుంచి 2009వరకు.. ఒక్క 2004లో తప్ప.. వరుస విజయాలు నమోదు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు.
2014లో తొలిసారి విజయనగరం ఎంపీగా పోటీచేసి గెలిచిన గజపతిరాజు… మోదీ కేబినెట్‌లో విమానయాన మంత్రిగా పనిచేసి జాతీయస్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 మార్చిలో ఏపీ స్పెషల్ స్టేటస్ కేంద్రపదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు సమకాలీకుడిగా పేరొందిన అశోక్… పోలిట్ బ్యూరో సభ్యుడిగా టీడీపీకి విశేషమైన సేవలందించారు. అశోక్ గజపతి రాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే వయోభారంతో 2024 ఎన్నికలకు దూరంగా ఉండి, తన స్థానంలో కుమార్తె ఆదితి గజపతిని బరిలో నిలిపి.. ఆమెతో పాటు జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు.
కూటమి ప్రభుత్వ వచ్చినప్పటి నుంచి.. ఆయనకు సరితూగే పదవి తప్పక వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆ ప్రచారం నిజమై… రాజుగారికి గవర్నర్ గిరీ దక్కింది. గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్‌గజపతికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత నుంచి ప్రశంసలు అందడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.