ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 2 సార్లు వరద పోటెత్తినా పులస చేపలు మాత్రం జాలర్లకు పెద్దగా చిక్కడం లేదు. గంగమ్మ ఈ సారి తమకు పెద్దగా కనికరించడం లేదని జాలర్లు చెబుతున్నారు. అయితే పులస చేపల లభ్యత ఇంత కఠినంగా మారడంతో ప్రభుత్వం, మత్స్యశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.
పులస నలుసయిపోయింది. అసలు దొరకడమే గగనమైపోయింది. గోదావరికి కొత్తనీరు పులస మాత్రం పెద్దగా జాలర్ల వలలకు చిక్కడం లేదు. దొరికినా అవి కేజీకి మించడం లేదు. దీంతో దొరికే అర కొర పులసలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పులసలు దొరికితే తమకు ఇవ్వాలని కొందరు ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారు. తాజాగా యానాం రేవులో కేజీ నుంచి కేజీన్నర బరువున్న పులస చేప వేలంలో రూ.18,000 ధర పలికింది. ఎంత రేటు పెట్టైనా సరే ఆలోచించకుండా చెల్లించి కొనుగోలు చేసేందుకు పులస ప్రియులంతా ముందుకొస్తున్నారు. దీంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది.
సముద్రంలో ఉండే విలస చేపలు సంతానోత్పత్తి కోసం వలసపోతూ వర్షాకాలంలో గోదావరి వంటి మంచినీటి నదుల్లోకి ప్రవేశిస్తాయి. వరదల సమయంలో వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎదురు ఈదుకుంటూ వచ్చే ఈ చేపలు ఎర్రనీటిలోకి చేరిన తర్వాత పులసలుగా మారతాయి. ఎదురీదడం వల్లే వాటికి అంత టేస్ట్ వస్తుంది. వాటి ప్రత్యేక రుచికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా వేట యథేచ్ఛగా సాగింది. అయితే జల కాలుష్యం, గుడ్లు పెట్టక ముందే వేట జరగడం వల్ల పులస లభ్యత స్పష్టంగా తగ్గిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal