కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స

నెలలు నిండని శిశువుకు గుండె సమస్యతో చికిత్స అవసరమైంది. కిమ్స్ హాస్పిటల్ గుండె వైద్యులు అత్యాధునిక డివైస్ ఉపయోగించి శస్త్రచికిత్స అవసరం లేకుండా పీడీఏ మూసివేశారు. ఈ డివైస్ తో చికిత్స పొంది కోలుకున్న అతి తక్కువ బరువుగల శిశువుగా .. ఈ బుడతడు రికార్డు సృష్టించాడు.

ఏడు నెల‌ల‌కే.. అంటే నెల‌లు నిండ‌క‌ముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన స‌మ‌స్య వ‌చ్చింది. అత‌డికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక ప‌ద్ధ‌తిలో, శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండా న‌యం చేసి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాల‌ను ఆస్ప‌త్రికి చెందిన కన్సల్టెంట్ నియోనాటాజిస్ట్ డా. భవాని దీప్తి, క‌న్స‌ల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ సుదీప్ వ‌ర్మ తెలిపారు.

“న‌గ‌రంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన దంప‌తుల‌కు నెల‌లు నిండ‌క‌ముందే ఏడు నెల‌ల‌కే ఒక బాబు పుట్టాడు. దీంతో అత్యవసర పరిస్థిత్తుల్లో 97 రోజుల పాటు బాబును ఎన్ఐసియూలో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో ఊపిరితిత్తుల నుండి రక్తం రావడం, గుండె సంబంధిచిన పీడిఏ సమస్య వల్ల వెంటిలేటర్ అవసరం పడింది.

త‌ల్లి క‌డుపులో బిడ్డ ఉన్న‌ప్పుడు ఊపిరితిత్తుల‌కు, మిగిలిన శ‌రీరానికి, రక్త సరఫరా చేసే రక్తనాళాలకు మ‌ధ్య ఒక గొట్టం లాంటిది ఉంటుంది. పుట్టిన 7 నుంచి 10 రోజుల్లో అది మూసుకుపోతుంది. కానీ, నెల‌లు నిండ‌కుండా పుట్టిన పిల్ల‌ల‌కు అది మూసుకోవ‌డం క‌ష్టం అవుతుంది. దీనినే పీడిఏ అంటారు. ఈ సమస్య వల్ల ఊపిరితిత్తుల‌కు ర‌క్తం ఎక్కువ‌గా వెళ్లి ఒత్తిడి పెరుగుతుంది. గుండె ప‌నితీరు దెబ్బ‌తింటుంది. నెల‌లు నిండ‌ని శిశువుల్లో 80% మందికి ఈ త‌ర‌హా స‌మ‌స్య ఉంటుంది. అప్పుడు ఊపిరితిత్తులు ప‌నిచేయ‌క‌పోవ‌డం, గుండె కూడా దెబ్బ‌తిన‌డంతో వెంటిలేట‌ర్ పెట్టాల్సి వ‌స్తుంది.

ఈ సమస్యకు ముందుగా మందులు వాడి చూస్తారు. వాటితో న‌య‌మైతే ప‌ర్వాలేదు. లేక‌పోతే మాత్రం త‌ప్ప‌నిస‌రిగా శ‌స్త్రచికిత్స గానీ, ఇలాంటి డివైస్‌తో మూసేయ‌డం గానీ చేయాలి. లేక‌పోతే ప్రాణాపాయం కూడా సంభ‌విస్తుంది.

ఇంత‌కాలం ఎద‌ భాగానికి ఒక ప‌క్క నుంచి శ‌స్త్రచికిత్స చేసి ఆ రంధ్రాన్ని మూసేసేవారు. కానీ, ఈ కేసులో బాబు అతి తక్కువ బరువు ఉండ‌డం, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉండ‌డంతో శ‌స్త్రచికిత్స చేయ‌డం అంత సుర‌క్షితం కాద‌ని భావించారు. అందుకే అత్యాధునిక ప‌రిక‌రంతో ఆ రంధ్రాన్ని మూసేయాల‌ని నిర్ణ‌యించారు. సర్జరీ చేసే సమయానికి అత‌డి బ‌రువు కేవ‌లం 600 గ్రాములు మాత్ర‌మే ఉన్నాడు.

1.2 మిల్లీమీట‌ర్లు చుట్టుకొల‌త ఉన్న పికోలో అనే అత్యాధునిక పరికరాన్ని కాలి న‌రం ద్వారా లోప‌ల‌కు పంపి, దాని సాయంతో రంధ్రాన్ని మూసేశారు వైద్యులు. ఈ డివైస్ అమర్చి కోలుకున్న శిశువుల్లో దేశంలోనే అతి తక్కువ బరువు గల చిన్నారిగా రికార్డు సృష్టించాడు. దీంతో రంధ్రం పూడుకుపోయి, బాబుకు ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ న‌య‌మ‌య్యాయి. ఈ ప్రొసీజ‌ర్ త‌ర్వాత ఎన్ఐసీయూలో డాక్ట‌ర్ భ‌వానీ దీప్తి, డాక్ట‌ర్ సింధు బృందం బాబును కంటికి రెప్ప‌లా కాపాడుకున్నారు.

శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండానే పీడీఏ మూయ‌డానికి ఈ ప‌రిక‌రం గేమ్‌ఛేంజ‌ర్ అవుతుంది. బాబుకు ఇక ఎలాంటి స‌మ‌స్య‌లు లేక‌పోవ‌డంతో పాలు కూడా తాగ‌డం మొద‌లుపెట్టాడు. త‌ర్వాత 2.45 కిలోలకు బ‌రువు పెర‌గడంతో డిశ్చార్జి చేసినట్లు డాక్ట‌ర్ భవనీ దీప్తి,  డా.సుదీప్ వ‌ర్మ వివ‌రించారు.


About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *