కర్నూలు జిల్లా ఆదోనిలో సిరిగుప్ప రోడ్డులోని గోదాములో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు సివిల్ సప్లై డైరెక్టర్ దృష్టికి వచ్చింది. ఆ వెంటనే మహేష్ నాయుడు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. 1800 బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు. ఆ సమయంలో పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. సీజ్ చేయాలని సూచించి డైరెక్టర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయమే 1800 బస్తాలకు బదులు కేవలం 109 బస్తాలు మాత్రమే సీజ్ చేసినట్లు రెవెన్యూ పోలీస్ అధికారులు చెప్పారు. పట్టుబడిన వెంటనే అధికారుల సహకారంతో మాఫియా బియ్యాన్ని మరో చోటుకు తరలించారు.
గోదాము దగ్గర కాపలాగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సహకరించినట్టు సమాచారం. తనిఖీల సమయంలో గోదాంలో 1800 బస్తాలు ఉన్నట్లు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది. అలాంటప్పుడు కేవలం 109 బస్తాలు మాత్రమే సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించడం.. మరి బరితెగింపేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల బరితెగింపుపై సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, ఆ శాఖ ఎండీకి డైరెక్టర్ మహేష్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ కూడా జరుగుతుంది. ఏ క్షణమైన బరితెగించిన అధికారులపై వేటుపడే అవకాశం కనిపిస్తోంది