యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గుమ్మి రామిరెడ్డి గారి గోశాలలోని గిర్ జాతి ఆవు రూ. 10 లక్షలకు అమ్ముడుపోయింది. రోజుకు 16 లీటర్ల పాలను ఇచ్చే ఈ ఆవు యొక్క అద్భుతమైన పాల దిగుబడి దీనికి కారణం. ఈ ఆవును ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమిత్ కిషన్ కొనుగోలు చేశారు.
సాధారణంగా ఓ ఆవు ధర ఎంతుంటుంది.. రూ.10 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంటుంది. బాగా పాలిచ్చే ఆవు అయితే రూ.60 వేల ధర పలుకుతుంది. కానీ, ఈ ఆవు ఏకంగా రూ.10 లక్షల ధర పలికింది. అంత ధర పెట్టి ఆ ఆవును ఎందుకు కొన్నారు? దాని ప్రత్యేకత ఏంటి? ఇంతకీ రూ.10 లక్షలు చెల్లించి ఆ ఆవును కొన్న వ్యక్తి ఎవరో ఏంటో ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురంలో గుమ్మి రామిరెడ్డి గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి నాలుగున్నరేళ్ల క్రితం రెండు గిర్ జాతి ఆవులను తెప్పించి గోశాల ప్రారంభించారు. అలా ప్రారంభించిన ఆ గోశాల బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం రామిరెడ్డి గోశాలలో 132 గిర్ జాతి ఆవులు ఉన్నాయి.
అయితే.. ఆయన రూ.10 లక్షలకు అమ్మిన ఆవు ఉదయం 8 లీటర్లు, సాయంత్రం 8 లీటర్ల చొప్పున మొత్తం ఒక రోజులో ఏకంగా 16 లీటర్ల పాలు ఇస్తుంది. ఆవులు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడం అరుదు. గేదెలు అయితే అలా ఇస్తాయి. అయితే.. రోజుకు 16 లీటర్ల పాలు ఇచ్చే ఈ ప్రత్యేకమైన గిర్ జాతి ఆవును తాజాగా ఏపీకి చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు. ఆవు కోసం ఆయన రూ.10 లక్షలు ధర చెల్లించారు. ఏపీలోని సత్యసాయి జిల్లాలోని పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల నిర్వాహకుడు అమిత్ కిషన్ ఈ ఆవును రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఆదివారం ఈ ఆవును వాహనంలో పెనుగొండకు తరలించారు. మరి ఇంత భారీ ధర పలికిన ఈ ఆవు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.