అడవిలో దారి తప్పిన ఫారెస్ట్ ఆఫీసర్.. 13 రోజులైనా జాడలేదు! ఏంటా అని వెతగ్గా.. చివరికి..

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ చెంచుపేటకు చెందిన తోకల మల్లయ్య(65) అటవీ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసి రిటైర్డ్ అయ్యాడు. అయితే ఇంటి వద్దే ఉంటున్న మల్లయ్య అటవీ ఉత్పత్తుల సేకరణకు తరచూ అడవిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. అయితే గత నెల 28వ తేదీన ఇదే మాదిరిగా అడవిలోకి వెళ్లిన మల్లయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. చుట్టుపక్కల అంతా వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో సమీపంలోని పెంటల్లోని చెంచులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి సైతం ఎలాంటి సమాచారం లేదు.

గతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేసిన నేపథ్యంలో ఎక్కడో తప్పిపోయి ఉంటాడని తిరిగి వచ్చేస్తాడని భావించారు. నాలుగు రోజులు గడుస్తున్న మల్లయ్య ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. అయితే మల్లయ్య వెంట వెళ్ళిన పెంపుడు కుక్క తిరిగివచ్చింది. దీంతో మల్లయ్య ఆచూకీ లభించడంలేదని లింగాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు, ఫారెస్టు సిబ్బంది మల్లయ్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఓ చెట్టు వద్ద కుళ్ళిపోయిన స్థితిలో మల్లయ్య మృతదేహం కుటుంబ సభ్యులకు లభ్యం అయ్యింది. పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల, ఇతర అధికారుల సమక్షంలోనే మల్లయ్య మృతదేహానికి ఘటనాస్థలిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఎలుగుబంటి దాడి చేయడంతోనే మల్లయ్య మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. మల్లయ్య మృతదేహంపై ఎలుగుబంటి దాడికి సంబంధించిన గాయాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు అటవీ శాఖ అధికారి రవికుమార్ తెలిపారు.

మల్లయ్య మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండడంతో అక్కడే కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు చేశారు. ఇక మల్లయ్యపై ఎలుగుబంటి దాడి చేసి చంపడంతో నల్లమల చెంచుపెంటల్లో భయాందోళన నెలకొంది. అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులు వన్య ప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక బాధిత కుటుంబానికి అటవీశాఖ తరఫు నుండి వన్యప్రాణి హక్కుల చట్టం ప్రకారం ఆర్థిక సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *