కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగింది..! పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే తేల్చింది..! కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇటు సీబీఐ విచారణకు కాషాయపార్టీ కూడా పచ్చజెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారుపార్టీదేనని హస్తం నేతలతో కలసి కమలంపెద్దలు గట్టిగానే వాదిస్తున్నారు. ఇక అదంతా అటుంచితే… సీబీఐ ఎంట్రీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ ఉన్న సీబీఐ ఎలా వస్తుంది..? వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
కాళేశ్వరంపై ప్రభుత్వ ప్రకటన తర్వాత పరిణామాలు చకచకా మారబోతున్నాయి. కాళేశ్వరంపై అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద CBI విచారణ జరిపించాలని లేఖ రాసినట్లు తెలిసింది. అలాగే కాళేశ్వరం మీద జరిగిన విజిలెన్స్ ఎంక్వైరీ, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులను కేంద్ర హోంశాఖకు అటాచ్ చేయనుంది. ఫైనల్‌గా హోంశాఖ ఆదేశాల మేరకు కాళేశ్వరంపై విచారణ నిమిత్తం రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనుంది సీబీఐ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ విచారణపై .. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ నివేదికపై తదుపరి విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించగా.. సభ ఆమోదించింది.
ఇక ప్రొసీజర్ అంతా బానే ఉన్నా… సీబీఐ ఎంట్రీకి ఓ చిన్న చిక్కు వచ్చిపడింది. అదే సీబీఐ ఎంట్రీకి మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన బారికేడ్. 2022లో సీబీఐ అనుమతిని నిరాకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా 51 జీవో జారీ చేసింది. దీంతో సీబీఐ ఏదైనా కేసు విచారణ జరపాలంటే ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే… గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన జీవోను ప్రస్తుత రేవంత్ సర్కార్ సవరించేందుకు సంసిద్ధమైంది. జీవో 51ను సవరించి సీబీఐకి రూట్ క్లియర్ చేసేందుకు రెడీ అయిపోయింది. సో.. సీబీఐ ఎంట్రీకి గ్రాండ్ వెల్‌కమ్ అన్నట్లే..
ఇటు సీబీఐ విచారణపైనా పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ దగ్గర 7,072 పెండింగ్ కేసులున్నాయి. వీటిలో 529 అవినీతి కేసులను ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అలాగే సీబీఐలో 7,295 మంది సిబ్బంది పనిచేస్తుండగా.. 16 వందల 10 మంది ఉద్యోగుల కొరత ఉంది. దీంతో పెండింగ్ కేసులు, పనిభారంతో పలు సందర్భాల్లో దర్యాప్తు జాప్యమవుతోంది. మరీ కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే… విచారణ ఎప్పుడు మొదలవుతుంది…? వాస్తవాలు ఎప్పుడు బయటకొస్తాయి..? అన్న దానిపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర రచ్చ నడుస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోంది..