ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) 2024 సీబీటీ2 పరీక్షలు మార్చి 19, మే 2, 6వ తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రైల్వేశాఖ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్‌లతో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డులను జులై 2 నుంచి 7వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. లోకోపైలట్ పరీక్షలకు సంబంధించి కటాఫ్ మార్కులను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మరోవైపు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)కు సంబంధించిన సిటి ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. పరీక్షకు నాలుగు రోజులు ముందుగా అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. సీబీఏటీ పరీక్షలు జులై 15న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి గత ఏడాది జనవరిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 2,528 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
ఏపీలో ప్రశాంతంగా బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 16 ప్రభుత్వ, 236 ప్రైవేటు నర్సింగ్ కాలేజీల్లో 13,800 నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో 62, హైదరాబాద్‌లో మరో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఈ సీట్ల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,783 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష ‘కీ’ కూడా అదే రోజు విడుదలైంది. వారంపాటు అభ్యంతరాలు స్వీకరించి, ఆ వెనువెంటనే ఫలితాలు ప్రకటిస్తామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు.