రైల్వేలో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పట్నుంచంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో RPF కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. గతేడాది ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చినా .. ఇప్పటి వరకు పరీక్షకు సంబంధించిన అప్ డేట్ లు వెలువడకపోవడంతో అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా పరీక్షల షెడ్యూల్ జారీ చేయడంతో వీరి ఎదురు చూపులకు తెరపడినట్లైంది..

దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక అప్‌డేట్‌ వెలువరించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా రాత పరీక్ష తేదీలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించలేదు. ఆ తేదీలను తాజాగా రైల్వే బోర్డు ప్రకటించింది. ఆర్‌పీఎఫ్‌ రాత పరీక్షలు (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను రాత పరీక్షకు పది రోజుల ముందు విడుదల చేస్తారు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, పరీక్ష తేదీ, సమయం, మార్గదర్శకాలు వంటి తదితర సమాచారం ఉంటుంది. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తారు. అభ్యర్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

కాగా గత ఏడాది మొత్తం 4,660 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రైల్వే బోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిల్లో 452 ఎస్సై పోస్టులు, 4208 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఎస్సై పరీక్షలు గత డిసెంబర్‌లో జరిగాయి. ఈ మేరకు ఆర్‌పీఎఫ్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ప్రకటించింది. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, పట్నా, ప్రయాగ్‌రాజ్, సిలిగురి, తిరువనంతపురం, రాంచీ, సికింద్రాబాద్, గోరఖ్‌పూర్‌ రైల్వే రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

About Kadam

Check Also

పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగు వారితో సహా మొత్తం ఎంత మంది మరణించారంటే..

ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉల్కిపడింది. ప్రకృతి అందాల నడుమ సంతోషంగా కొన్ని రోజులు గడిపేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *