అదో అటవీప్రాంతం.. కానీ నగరాల్లోని కనిపించని తీరులో అక్కడి విద్యార్థినీ, విద్యార్థులు ఏఐ టూల్స్ వాడుతున్నారు. అధికవేగంతో తెలంగాణా సర్కార్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ వేగంతో.. ఇప్పుడు మారుమూల పల్లెల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చొచ్చుకుపోతోంది. పెద్దపెల్లి జిల్లాలో ఓ మారుమూల పల్లెలో కనిపిస్తున్న ఆ విప్లవమే ఇప్పుడు చదువుతున్న వార్త.
తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణపేట, మద్దూర్ గ్రామాలతో పాటు.. పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ వంటి గ్రామాలు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. అయితే ఇంకొన్ని అడుగులు ముందుకేసి.. పట్టణాలు, నగరాల్లోని ప్రైవేట్, కార్పోరేట్ విద్యార్థులు కూడా ఇంకా అందుకోలేని ఆర్టిఫిషియల్ పాఠాలను వింటున్నాయి. ఈ ప్రాజెక్టును ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా అటు సంగారెడ్డి, ఇటు పెద్దపెల్లి జిల్లాల్లో తొలుత ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి శ్రీరాంపూర్ లో 1200 కుటుంబాలుండగా.. ఇప్పటికే 900 ఇళ్లకు టీ ఫైబర్ సేవలందుతున్నాయి. గత ఏడాది 2024, డిసెంబర్ 8వ తేదీనే మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు.
గత ఏడాది నుంచే ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ టీ ఫైబర్ ద్వారా నిరంతరం శరవేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు టీ ఫైబర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఇందుకోసం మూడు డిజిటల్ బోర్డ్స్ తో పాటు, రెండు కంప్యూటర్ మానిటర్స్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడిక్కడ విద్య వీటి ద్వారానే డిజిటల్ మాధ్యమంలో కొనసాగుతోంది. ఇప్పుడు గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్స్ తో పాటు, పక్సిటీ ఏఐ టూల్ ను కూడా వాడుతున్నారు ఇక్కడి విద్యార్థులు. వాయిస్ మోడ్ లో తమకున్న సందేహాలు, ప్రశ్నలడిగి నివృత్తి చేసుకుంటున్నారు. వీటికి తోడు తెలంగాణా స్కూల్ యాప్ లోకి ఎంటరై పాఠాలకు సంబంధించిన ఇంటరాక్ట్ వీడియోలు చూస్తూ మూస పద్ధతులకు భిన్నంగా విప్లవాత్మక శైలిలో సాగుతోంది అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ పాఠశాల విద్య.
గతంలో ఇంటర్నెట్ సిగ్నల్సే దొరకని కాలం నుంచి ఇప్పుడు శరవేగంగా బ్రౌజింగ్ కు ఆస్కారమేర్పడ్డ ఇంటర్నెట్ ను ఒక సానుకూల దృక్పథంతో ఇక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినియోగిస్తూ మిగిలిన ప్రపంచానికి భిన్నంగా నిలుస్తున్నారు. టీ ఫైబర్ సాయంతో హై స్పీడ్ ఇంటర్నెట్ రావడంతో ఇప్పుడీ గ్రామంలో కేబుల్ కనెక్షన్స్ కూడా తగ్గిపోయి. టీవీలు కూడా ఓటీటీలపైనే నడుస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఎదిగినవారెవరైనా ఇంటికి వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవడానికీ ఇక్కడ ఏర్పాటు చేసిన హై స్పీడ్ టీ ఫైబర్ ఇంటర్నెట్ ఎంతో ఉపయోగపడుతోంది. మంత్రి శ్రీధర్ బాబు చొరవతోనే తమ గ్రామం ఇంటర్నెట్ విప్లవాన్ని చూసిందంటున్నారు స్థానికులు. ప్రస్తుతం ఆర్నెల్ల వరకూ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉచితంగానే టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు. ఆ తర్వాత బిల్లు చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రాజ్యమేలుతున్న కాలాన.. గ్రామాలు, పట్టణాల్లో ఇంకా రావాల్సిన మార్పులకు ఓ నిలువెత్తు సాక్ష్యంలా ఇప్పుడు అడవి శ్రీరాంపూర్ నిలుస్తోంది.