మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు ఇటీవల ఫలితాలు వెలువరించిన సంగతి తెలిసిందే. మెరిట్ జాబితాలోని అభ్యర్ధులకు 1:1 నిష్పత్తిలో తొలి విడత ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది..
కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు ఇటీవల ఫలితాలు వెలువరించిన సంగతి తెలిసిందే. మెరిట్ జాబితాలోని అభ్యర్ధులకు 1:1 నిష్పత్తిలో తొలి విడత ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది. ఇక రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది.
మెగా డీఎస్సీలో ప్రతిభకనబరచిన వారికి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. వీరితో పాటు మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో తదుపరి మెరిట్‌లిస్ట్‌లోని అభ్యర్ధులకు, స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు, గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్లు విడుదల చేసింది. ఈ మేరకు కాల్ లెటర్లు అందుకున్న వారంతా మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఒకవేళ కాల్ లెటర్ల జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ రెండో విడతలో సర్టిఫికెట్ల పరిశీలనకు మొత్తం 900 మంది వరకు అభ్యర్ధులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో దివ్యాంగ అభ్యర్థులు 120 మంది వరకు ఉన్నారు. వీరంతా వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు వెళ్లాల్సి ఉంటుంది. రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో కొత్త వారికి మూడో విడతలో ధ్రువపత్రాల పరిశీలనకు కాల్ లెటర్లు జారీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.