చదువుల్లో విద్యార్థులు వందకు 100 మార్కులు సాధిస్తే.. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. క్రికెట్ లో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. తమ ప్రొఫెషన్ లో వందకు వందశాతం సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి సక్సెస్ రీచ్ అయితే .. ఎంజాయ్ చేస్తుంటారు. పట్టుమని పదో తరగతి చదవకపోయినా.. మూడు పదుల వయస్సులోనే సెంచరీ దాటేశాడు. అందరూ ప్రొఫెషనల్స్ మాదిరిగానే శతకం సాధించాడు.. ఆ శతకానుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణం కమ్మనిచెట్ల వీధికి చెందిన పిట్ల గంగాధర్ అలియాస్ సాంబ 9వ తరగతి మధ్యలోనే చదువు ఆపేశాడు. తల్లి వద్ద ఉంటూ కూలీ పనులకు వెళ్లేవాడు. 12 ఏళ్ల క్రితం తండ్రి చంద్రశేఖర్ అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తుండేవాడు. దొంగతనం చేసిన డబ్బుతో క్రికెట్ బెట్టింగ్, జూదం ఆడుతూ తిరుగుతుండేవాడు. ఉదయం రెక్కీ చేసి రాత్రి వేళలో తాళాలు పగుల గొట్టి.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న దేవరకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో రాపోతు రమేష్ ఇంట్లో పట్టపగలు తాళాలు పగలగొట్టి గంగాధర్ దొంగతనానికి పాల్పడ్డాడు. రూ.6 లక్షల నగదు, 2.2 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. ఈ చోరీతో.. దొంగతనాల్లో శతకం సాధించినందుకు ప్రత్యేకంగా జల్సా చేయాలని గంగాధర్ భావించాడు. ఇందులో కొంత నగదును దేవరకొండలోనీ ఖిల్లా పార్క్‌లో దాచిపెట్టాడు. మిగిలిన బంగారాన్ని నగదును వెంట తీసుకువెళ్లాడు. ఈ చోరీ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు దేవరకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో మూడు టీంలను ఏర్పాటు చేసి సిసి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి గాలింపు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఖిల్లా పార్క్ లో దాచిపెట్టిన నగదును తీసుకువెళ్లేందుకు గంగాధర్ దేవరకొండకు వచ్చాడు. ఖిల్లా పార్క్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుండి రూ.2.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగాధర్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal