తన కొడుకే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తను ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టకుండానే.. వైసీపీ ఇంతలా స్పందిస్తుంటే ఇది భయమా? బెదురా అనేది వాళ్లకే తెలియాలన్నారు. రాజారెడ్డి అని తన బిడ్డకు పేరు పెట్టింది వైఎస్సార్ అని షర్మిల చెప్పారు.
ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో షర్మిల వెంట ఆయన తనయుడు కనిపిస్తూ ఉండటంతో.. అతని పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తన కుమారుడు సమయం వచ్చినప్పుడు రాజకీయ రంగప్రవేశం చేస్తాడని.. షర్మిల బహిరంగంగానే ప్రకటించారు. దీంతో రాజారెడ్డి వైఎస్సార్ వారసుడు అంటూ.. షర్మిల అనుచరులు భావిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజారెడ్డి నిజమైన వైఎస్సార్ రాజకీయ వారసుడేనని, దీని విషయంలో ఎలాంటి అనుమానం లేదని ఆమె స్పష్టంచేశారు.
“నా కొడుకు ఇప్పటివరకు రాజకీయాల్లో అడుగు కూడా పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంత గందరగోళం సృష్టిస్తుంటే… ఇది భయమా? లేక బెదిరింపా? వాళ్లకే తెలిసిన విషయం. నా కుమారుడికి ‘వైఎస్ రాజారెడ్డి’ అనే పేరు స్వయంగా నా నాన్నగారు వైఎస్సార్ పెట్టారు. వైసీపీ ఎంత కేకలు వేసినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈ పేరును ఎవ్వరూ మార్చలేరు” అని షర్మిల గట్టిగా చెప్పారు. చంద్రబాబు చెప్తేనే.. తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లు ఓ వీడియోను మార్ఫ్ చేసి ప్రచారం చేస్తున్నారని… అది చూసి తనకు నవ్వు వచ్చిందన్నారు షర్మిల.
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో జగన్ వైఖరిని టార్గెట్ చేస్తూ షర్మిల నిలదీశారు. వైఎస్సార్ జీవితాంతం BJP, RSSలను వ్యతిరేకించారని.. కానీ ఆయన కొడుకే RSS అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అవమానకరమన్నారు. రాజ్యాంగం గురించి లోతుగా తెలిసిన న్యాయ నిపుణుడు సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
అదానీ, రిలయన్స్ వ్యవహారాలను ప్రస్తావిస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు. “వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ కుట్ర ఉందని జగన్ చెప్పాడు. కానీ అదే రిలయన్స్ వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. అదానీ కోసం గంగవరం పోర్ట్‌ను త్యాగం చేశాడు. ఐదు ఏళ్ల అధికారంలో BJP ప్రతీ బిల్లుకు జగన్ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఏ ముఖంతో ఈ మద్దతు ఇస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో BRS నిశ్శబ్దంగా ఉండగా, వైసీపీ మాత్రం BJPకు ఓటు వేసిందని ఆమె మండిపడ్డారు. టీడీపీ-జనసేన పొత్తు బహిరంగమని, కానీ జగన్ BJPతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని షర్మిల ఆరోపించారు.
Amaravati News Navyandhra First Digital News Portal