ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జీబీఎస్. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం నమోదు అయింది. కరోనాలా ఇది అంటువ్యాధి కాదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా వుండాలి. డాక్టర్లు చెప్పినట్టుగా వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ..ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఆమెకు ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఇటీవల కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించిన తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్‌లోని నిమ్స్, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఇలా ఆమె వైద్యానికి లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలోని పుణెలో జీబీఎస్ కారణంగా పలువురు మృతి చెందారు. ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం సంభవించడం ఇదే మొదటిదని వైద్యులు తెలిపారు. జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపిస్తుందని.. తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ జీబీఎస్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళకు గురికావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. బాధితుల్లో కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి. చికిత్సతో బాధితులకు నయం చేయొచ్చని అంటున్నారు.
బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇది అని వైద్యులు తెలిపారు.ముఖ్యంగా నరాలపైనే జీబీఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు వెల్లడించారు.