బండి సంజయ్‌కి మరోసారి సిట్‌ నోటీసులు… విచారణ కు సమయం ఇవ్వాలని కోరిన పోలీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తరువాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. విచారణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి సిట్‌ మరోసారి నోటీసులు పంపింది. విచారణకు సమయం ఇవ్వాలని సిట్‌ అధికారులు నోటీసుల్లో కోరారు. దీంతో ఈనెల 24న విచారణకు బండి సంజయ్‌ సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్‌ని సిట్‌ అధికారులు విచారించునున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఓ వైపు అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై ఆరా తీస్తూనే.. అప్పట్లో ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్ కూడా సిట్ విచారణకు సాక్షిగా హాజరై వాంగ్మూలం అందించారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ వాంగ్మూలాన్ని సైతం అధికారులు రికార్డ్‌ చేయనున్నారు.

బీఆర్ఎస్ హయాంలో వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ కారణంగా తాము రాజకీయంగానూ నష్టపోయాయని.. గెలవాల్సిన కొన్ని సీట్లలో ఓడిపోయామనేది రాజకీయ నాయకుల వాదన. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇదే రకమైన వాదన వినిపించారు. కాంగ్రెస్ కంటే బీజేపీ నేతల ఫోన్లనే ఎక్కువగా ట్యాపింగ్ చేశారని ఆయన గతంలో ఆరోపించారు. త్వరలోనే సిట్ ముందుకు హాజరై వాంగ్మూలం ఇస్తానన్నారు. కేసును సీబీఐకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు తనతో పాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను నాటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని బండి సంజయ్‌ గతంలో ఆరోపించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బండి సంజయ్‌ను సాక్షిగా విచారించే అవకాశం ఉంది. బండి సంజయ్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. దీనిపై ఆయన ఏమి చెబుతారు, దర్యాప్తుకు ఏవిధంగా సహకరిస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *